Share News

బొగ్గు ద్వారా సిన్‌ గ్యాస్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:24 AM

బొగ్గు ద్వారా సిన్‌ గ్యాస్‌ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీని కోసం రూ.46 వేల కోట్లు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

బొగ్గు ద్వారా సిన్‌ గ్యాస్‌

ప్రత్యామ్నాయ ఇంధనం ఉత్పత్తికి కేంద్రం చర్యలు.. రూ.46 వేల కోట్ల కేటాయింపు

క్రిటికల్‌ మినరల్స్‌ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి లక్ష్యం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): బొగ్గు ద్వారా సిన్‌ గ్యాస్‌ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీని కోసం రూ.46 వేల కోట్లు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ప్రభుత్వం మైనింగ్‌, కోల్‌ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. గడచిన రెండేళ్లలో ఏటా 100 కోట్ల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇంధన దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా బొగ్గు నుంచి సిన్‌ గ్యాస్‌ ఉత్పత్తి దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి’ అని తెలియజేశారు సిన్‌ గ్యాస్‌ ఉత్పాదక ప్రక్రియ అయిన కోల్‌ గ్యాసిఫికేషన్‌పై ఈ నెల 11న హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. (హైడ్రోజన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌లతో కూడిన సింథిసి్‌సగ్యా్‌సనే సిన్‌ గ్యాస్‌ అంటారు. దీనిని విద్యుదుత్పత్తి, పారిశ్రామిక రసాయనాల తయారీ తదితర రంగాల్లో ఉపయోగిస్తారు). మరోవైపు, క్రిటికల్‌ మినరల్స్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీలు, సెమీ కండక్టర్‌లు, ఏఐ పరికరాలు మొదలైన వాటి తయారీలో క్రిటికల్‌ మినరల్స్‌ కీలకం. వీటిని కైవసం చేసుకునేందుకు ఒక దేశ ప్రభుత్వం మరో దేశాధినేతను రాత్రికి రాత్రి కిడ్నాప్‌ చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌లో క్రిటికల్‌ మినరల్స్‌ను వినియోగించామంటూ, మనకు ఎగుమతి చేసే ఒక దేశం వాటిని నిలిపివేసింది. అందుకే, క్రిటికల్‌ మినరల్స్‌లో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించి రూ.32 వేల కోట్లు కేటాయించాం. వినియోగంలో లేని పాత ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఇంటింటి నుంచీ (ఈ వేస్ట్‌ను) సేకరించనున్నాం. వీటి రీ సైక్లింగ్‌కు రూ.1500 కోట్లు కేటాయించాం. 20వ శతాబ్దం ఆయిల్‌ ఎకానమీ అయితే.. 21వ శతాబ్దం క్రిటికల్‌ మినరల్స్‌ ఎకానమీ’ అని కిషన్‌రెడ్డి వివరించారు.


పర్యాటకప్రాంతాలు.. ఆ బొగ్గు బ్లాకులు

దేశవ్యాప్తంగా వినియోగం పూర్తయిన 147 బొగ్గు బ్లాకులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం వంటి చర్యలతో పర్యావరణపరంగా వినియోగంలోకి తీసుకువచ్చి గిన్నిస్‌ రికార్డు సృష్టించాలన్నది తన ఆకాంక్ష అని కిషన్‌రెడ్డి తెలిపారు. గనులు ఉన్న ప్రాంతాల్లో 2 శాతం నిధులను డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌(డీఎంఎ్‌ఫ)కు కేటాయించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఇవ్వటం లేదన్నారు. ‘సింగరేణి పరిధిలోని జిల్లాల్లో రూ.300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల మేర డీఎంఎఫ్‌ నిధులు ఉన్నాయి. ఈ నిధులను ఏం చేస్తున్నారని కలెక్టర్‌లను అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ నిధులను ఆయా స్థానిక సంస్థలకు కేటాయించాల్సి ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి.. మెస్సీ పర్యటన కోసం వినియోగించారు’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైనీ బ్లాకు కాంట్రాక్టు కేటాయింపు అంశం తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణికి దక్కాల్సిన రెండు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిందని.. ఆ పార్టీ నేత కేటీఆర్‌ ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేయడం విడ్డూరమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నాడు తాను 40 లేఖలు రాసినా ఒక్కదానికీ స్పందించలేదని తెలిపారు. పీఎంవో ర్యాంకింగ్స్‌లో మీ శాఖ పనితీరు బాగా ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ వస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. నా స్థాయికి ఈ పదవే పెద్దది అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 09 , 2026 | 04:24 AM