మూడేళ్లలో ఇంధన స్వయం సమృద్ధి!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:14 AM
మూడేళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎరువుల ఉత్పత్తిలోనూ సాధిస్తాం
దేశవ్యాప్తంగా 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీల ఏర్పాటే లక్ష్యం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
చెన్నై, జూన్ 21(ఆంధ్రజ్యోతి): మూడేళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండటంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెప్పారు. ఆ దిశగా దేశంలో పలు చోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామని తెలిపారు. రెండ్రోజుల క్రితం ఒడిశాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగానే రూ.46 వేల కోట్ల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశం కనుక ఇతర దేశాల నుండి పెట్రోలు, యూరియా దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ప్రతి ఏటా పెట్రోలు, ఎరువుల దిగుమతుల కోసం రూ.3.5 లక్షల కోట్ల నుండి 4.5 లక్షల కోట్ల వరకూ విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నామని పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా, దేశంలో పెట్రోలు, ఎరువుల కొరత ఏర్పడుతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 2029 లోగా పెట్రోలు, ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాలనలో మోదీ రికార్డు
స్వాతంత్ర్యానంతరం మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టి, నెహ్రూ కంటే ఎక్కువ రోజులు దేశాన్ని పాలించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందన్నారు. నిరంతరం కల్లోల పరిస్థితుల మధ్య గడిపే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఉగ్రవాదుల సమస్యను నిర్మూలించి శాంతి భద్రతలకు మోదీ అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.