Share News

చిన్నారుల చికిత్సకు నిబంధనే అడ్డు!

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:24 AM

అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిఽధులు ఖర్చు కాకుండానే మురిగిపోతున్నాయి. కోటీ రెండు కోట్లు కాదు..

చిన్నారుల చికిత్సకు నిబంధనే అడ్డు!

  • కేంద్రం నిధులున్నా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు అందని వైద్యం

  • ఒక్కొక్కరికి 50 లక్షల పరిమితి పూర్తితో 100 మంది పిల్లలకు చికిత్స నిలిపివేత

  • కేటాయింపు 300 కోట్లు.. ఖర్చు 30 కోట్లే

  • మిగతా 270 కోట్లు ప్రభుత్వ ఖాతాలోనే

  • మార్చి 31తో మురిగిపోనున్న నిధులు

  • తమ పిల్లలకు చికిత్స కొనసాగించాలని కోరుతున్న తల్లిదండ్రులు.. కొందరు కోర్టుకు..

హైదరాబాద్‌, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిఽధులు ఖర్చు కాకుండానే మురిగిపోతున్నాయి. కోటీ రెండు కోట్లు కాదు.. ఏకంగా వందల కోట్లు ఇలా మురిగిపోతుండడం గమనార్హం. అరుదైన వ్యాధులకు సంబంధించి జాతీయ విధానం(ఎన్‌పీఆర్డీ)లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.300 కోట్లు కేటాయించింది. 2025 డిసెంబరు నాటికి ఖర్చయింది కేవలం రూ.30 కోట్లే. అంటే 85 శాతం నిధులు వినియోగించకుండా ప్రభుత్వ ఖాతాల్లోనే నిల్వ ఉన్నాయి. మిగిలిన రూ.270 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీతో మురిగిపోనున్నాయి. ఇటీవల ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అరుదైన వ్యాధులతో బాధపడే ఒక్కో రోగికి గరిష్ఠంగా రూ.50లక్షల ఆర్థిక సహాయం మాత్రమే అందేలా నిబంధన ఉంది. ఎన్‌పీఆర్డీలో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందిన సుమారు 100 మంది బాధిత చిన్నారులు ఇప్పటికే ఆ పరిమితిని పూర్తిగా వినియోగించుకున్నారు. చికిత్సతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి కొందరు తిరిగి పాఠశాలకు కూడా వెళుతున్నారు. కానీ నిధుల పరిమితి పూర్తయిందనే కారణంతో ఇప్పుడు వారికి ప్రాణాధార ఔషధాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దాంతో వారి ఆరోగ్యం మళ్లీ క్షీణించే ప్రమాదం ఏర్పడింది. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయుంచారు. ఇప్పటికే కేటాయించి.. ఖర్చు కాకుండా మిగిలిన రూ.270 కోట్లు తక్షణం విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ప్రాణాలు కాపాడేందుకు కేటాయించిన నిధులు ఖర్చుకాక మురిగిపోవడం పూర్తిగా పాలనా వైఫల్యం కిందకే వస్తుందని పేర్కొంటున్నారు. చికిత్సను ఖర్చు పరిమితి పేరుతో నిలిపివేయవద్దని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ డాక్టర్‌ అనిల్‌ బాండే కూడా కేంద్రానికి లేఖ రాశారు.

Updated Date - Feb 23 , 2026 | 02:24 AM