24 గంటల్లో డాక్యుమెంట్లు, పార్శిళ్ల డెలివరీ
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:50 AM
తపాలా శాఖ తాజాగా ప్రీమియం సేవలను ప్రారంభించింది. కేవలం 24 గంటల్లోనే డాక్యుమెంట్లు మొదలు 5 కేజీల్లోపు పార్శిళ్లను దేశవ్యాప్తంగా....
ఆరు మెట్రో నగరాల మధ్య ప్రీమియం సేవలను ప్రారంభించిన తపాలా శాఖ
హైదరాబాద్‌లో తొలుత 34 పోస్టాఫీసుల్లో బుకింగ్ సేవలు
న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తపాలా శాఖ తాజాగా ప్రీమియం సేవలను ప్రారంభించింది. కేవలం 24 గంటల్లోనే డాక్యుమెంట్లు మొదలు 5 కేజీల్లోపు పార్శిళ్లను దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల్లో డెలివరీ చేయనుంది. 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలను కూడా ప్రారంభించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వర్చువల్‌గా ఈ సేవలను ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో ఈ సేవలు మంగళవారం నుంచే మొదలయ్యాయి. వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యమని జోతిరాదిత్య తెలిపారు. ఈ సందర్భంగా కింగ్ కోఠిలో జరిగిన తపాలా శాఖ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వీణాకుమారి డెర్మాల్, హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ సుమితా అయోధ్య, హెడ్ క్వార్టర్స్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎన్‌ఆర్ విసాలాచ్చీ తదితరులు పాల్గొన్నారు. వీణాకుమారి మాట్లాడుతూ 24, 48 గంటల స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలను తొలుత హైదరాబాద్‌లోని 34 పోస్టాఫీసుల్లో ప్రారంభించబోతున్నామని తెలిపారు.