పైసల వేటలో.. పరిశోధన గాలికి!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:00 AM
మనదేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. వైద్య రంగంలో పరిశోధనల విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నామని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
వైద్య పరిశోధనల్లో అట్టడుగున భారత్.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లాభాలకే ప్రాధాన్యం
టాప్ ఆస్పత్రుల్లో ఏటా సగటున 48 పరిశోధనలే.. చైనా, అమెరికా, బ్రిటన్‌లో 2-3 వేలు
మనదేశంలో రోగుల డేటా కూడా అస్తవ్యస్థం.. తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మనదేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా.. వైద్య రంగంలో పరిశోధనల విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నామని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. దేశంలోని 60 శాతం జనాభాకు అనుబంధ వైద్య కళాశాలలు లేని ప్రైవేటు ఆస్పత్రులే వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రులు పరిశోధనలను పూర్తిగా గాలికొదిలేశాయని ‘జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్’లో డాక్టర్ సమీరన్ నంది, పరమానంద్ తివారీ అనే పరిశోధకులు ప్రచురించిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రుల్లోవిద్యాబోధన, పరిశోధనలకు తావు లేకుండా పోతోందని విమర్శించారు. వైద్య పరిశోధనల్లో అమెరికా, బ్రిటన్, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్‌లోని టాప్ 50 ప్రైవేటు ఆస్పత్రులు (వీటికి అనుబంధ మెడికల్ కాలేజీలు లేవు) ఏడాదికి ఒక్కొక్కటి సగటున 48 పరిశోధనా పత్రాలను మాత్రమే ప్రచురిస్తున్నాయి. అదే అమెరికాలోని ప్రముఖ ఆస్పత్రులు సగటున 2,898, చైనాలో 3,220, బ్రిటన్‌లో 2,701 పత్రాలను ప్రచురిస్తున్నాయని వారు తెలిపారు. మనదేశంలో అనుబంధ మెడికల్ కాలేజీలున్న ఆస్పత్రులు ఒక్కొక్కటి సగటున ఏటా 338 పత్రాలను ప్రచురిస్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిశోధనలతో పోల్చితే ఇవి ఏమాత్రం సరిపోవని పేర్కొన్నారు. అమెరికాలోని ‘మయో క్లినిక్’ ఒక్కటే ఏడాదికి 8 వేల వరకు పరిశోధనా పత్రాలను విడుదల చేస్తోంది. మనదేశంలోని మొత్తం ప్రైవేటు వైద్య రంగం కలిపి కూడా ఇన్ని ప్రచురించకపోవటం గమనార్హం. దేశంలో మెడికల్ కాలేజీలు లేని 99.9 శాతం ఆస్పత్రులు ఏడాదికి కనీసం 10 పరిశోధనా పత్రాలను కూడా ప్రచురించటంలేదని తేలింది. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు తమ వాటాదారులకు లాభాలు పంచడంపైనే దృష్టి పెట్టడం ఈ పరిస్థితికి కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
రోగుల డేటా అస్తవ్యస్థం
అధిక జనాభా కారణంగా మనదేశంలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి ఎక్కువ. అయితే, అత్యంత విలువైన ఆ రోగుల డేటాను కూడా ఆస్పత్రులు పరిశోధనలకు మళ్లించడం లేదు. రోగుల వ్యాధి చరిత్రను రికార్డు చేేస ‘ఎలక్ర్టానిక్ మెడికల్ రికార్డ్స్’ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇది పరిశోధనలకుప్రధాన అడ్డంకిగా మారిందని తెలిపారు. పరిశోధనల పట్ల ఆసక్తి తగ్గడానికి మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా కారణమని ఈ అధ్యయనం ఎత్తిచూపింది. వైద్య పరిశోధనల్లో దేశం సత్తా చాటాలంటే ప్రైవేటు ఆస్పత్రులు అకడమిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్‌గా రూపాంతరం చెందాలని సూచించింది.
నిధుల కొరతే అడ్డంకి
వైద్య పరిశోధనలకు భారీగా నిధులు అవసరం. అమెరికా లాంటి దేశాల్లో పరిశోధనలకు ప్రభుత్వాలే నిధులిస్తాయి. వైద్యుల్లో కూడా కొందరు పరిశోధనలకే పరిమితమవుతారు. మనదేశంలో వైద్య పరిశోధనలకు పెద్దగా ఫండింగ్ ఉండదు. నిధుల కొరతే పెద్ద అడ్డంకి. పైగా రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దాంతో క్లినికల్ డాక్టర్స్‌కు సమయం లేక పరిశోధనలపై దృష్టిపెట్టడం లేదు.
- డాక్టర్ రాహుల్ దేవరాజ్,
డైరెక్టర్, నిమ్స్ ఆస్పత్రి.