ఎగుమతులు, దిగుమతులు ఆగమాగం!
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:56 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అన్ని రంగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వంటగ్యాస్ నుంచి పెట్రోల్, డీజిల్ వరకూ పలు నిత్యావసరాల సరఫరాపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని ఉంటే..
అనిశ్చితిలో సరుకుల రవాణా
సాధారణ పరిస్థితుల్లో రోజుకు 3 కోట్ల టన్నులు.. ప్రస్తుతం 2 కోట్ల టన్నులే
పోర్టుల్లో, సంద్రంలో నిలిచిన బియ్యం
ఆగిపోయిన మాంసం ఎగుమతులు
తగ్గిన వంటనూనెల దిగుమతులు
షిప్పింగ్ చార్జీలు, ప్రీమియం పైపైకి..
దేశ వాణిజ్యంలో 90శాతం నౌకల్లోనే..
సరఫరా గొలుసుకు భారీ విఘాతం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్ర జ్యోతి): పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అన్ని రంగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వంటగ్యాస్ నుంచి పెట్రోల్, డీజిల్ వరకూ పలు నిత్యావసరాల సరఫరాపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని ఉంటే.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సముద్ర వాణిజ్యం ఆటుపోట్లకు గురవుతోంది. ఫలితంగా, వ్యాపార వాణిజ్య వర్గాలూ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేశ ఎగుమతులు, దిగుమతులపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రోజుకు సగటున జరిగే 3 కోట్ల టన్నుల సరుకు రవాణా.. 1.8 కోట్ల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పడిపోయిందని పేర్కొన్నాయి. సముద్ర మార్గాల్లో ఆటంకాలు ఎదురుకావడంతోపాటు రవాణా ఖర్చులు పెరిగాయని, దీంతో కొన్ని సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపాయి. మన దేశం నుంచి పశ్చిమాసియాకు ఏటా 11.8 బిలియన్ డాలర్ల (రూ.1,09,433 కోట్ల) విలువైన వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం కారణంగా ఇవి అనిశ్చితిలో పడ్డాయి. బాస్మతి బియ్యానికి ప్రధాన మార్కెట్ సౌదీ అరేబియా, ఇరాన్ కాగా.. ఈ బియ్యం రవాణా చాలా వరకు పోర్టుల్లో, సముద్ర మార్గం మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. మాంసం ఎగుమతులైతే ఏకంగా 70 శాతం ప్రభావితం అయినట్లు తెలిపారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యే మాంసం.. ప్రస్తుతం రవాణా సమస్యతో నిలిచిపోయింది. మరోవైపు, మన దేశ వంటనూనెల అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల మీదే ఆధారపడి ఉన్నాయి. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 పెరిగితే.. పామాయిల్, సోయాబీన్ ఆయిల్ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగాయి. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలో వంట నూనెల ధరల్లో 8-12 శాతం పెరుగుదల కనిపించింది.
బియ్యం బస్తాలకూ కటకట
బియ్యం బస్తాల తయారీకి పాలిమర్ అవసరం. దీనికి అవసరమైన ముడిసరుకు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంటుంది. యుద్ధం నేపథ్యంలో ముడిసరుకు లభ్యత తగ్గి పాలిమర్ కొరత ఏర్పడింది. దీంతో బియ్యం ఎగుమతులకేగాక సిమెంట్ పరిశ్రమలకు కూడా బస్తాల కొరత సమస్య ఎదురవుతోంది. ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి 45 దేశాలకు బియ్యం ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం బస్తాల కొరతతో బియ్యం ఎగుమతిపై ప్రభావం పడిందని పోర్టు అధికారులు చెబుతున్నారు.
70శాతం వాణిజ్యం సముద్ర మార్గంలోనే..
దేశంలోని ప్రధాన పోర్టుల నుంచి ఏటా 85.5 కోట్ల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. మొత్తం వాణిజ్యంలో వాటా పరంగా 95 శాతం, విలువ పరంగా 70 శాతం.. సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. దేశంలో 11 వేల కి.మీ.ల తీరప్రాంతం ఉంటే.. 13 ప్రధాన ఓడరేవులు, 200 చిన్న, మధ్యతరహా ఓడరేవులు ఉన్నాయి. ప్రధాన పోర్టుల నుంచి 150 నుంచి 200 వరకు భారీ వాణిజ్య నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. మన ఎగుమతుల విషయానికొస్తే.. ముడి చమురును దిగుమతి చేసుకుని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్‌గా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. యంత్రాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, రవాణా పరికరాలు, ఔషధ రంగంలో జనరిక్ మందులు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. సూరత్, ముంబయి కేంద్రాలుగా వజ్రాలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతి జరుగుతుంది. కాకినాడ పోర్టు నుంచి దక్షిణాఫ్రికా తదితర దేశాలకు బియ్యం ఎగుమతి భారీగా జరుగుతోంది. టీ, కాఫీ, మసాలా దినుసుల ఎగుమతి కూడా భారత్ నుంచి కొనసాగుతోంది. ఇక దిగుమతులను చూస్తే.. ప్రధానంగా ముడిచమురు, సహజవాయువు, బంగారం, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, విడిభాగాలు, సెమీకండక్టర్లు ఉంటున్నాయి. ఎరువులు, రసాయనాలు, పామాయిల్ కూడా గణనీయంగా దిగుమతి అవుతున్నాయి.
పెరిగిన షిప్పింగ్ చార్జీలు, బీమా ప్రీమియం
యుద్ధం కారణంగా సముద్ర వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. హొర్ముజ్ జలసంధి మార్గంలో ముడిచమురు, సహజవాయువు దిగుమతులు నిలిచిపోయి గ్యాస్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరిస్థితులు తలెత్తాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో షిప్పింగ్ చార్జీలు భారీగా పెరిగాయి. నౌకల మీద బీమా సంస్థలు వార్ రిస్క్ ప్రీమియంను భారీగా పెంచడంతో.. చాలా మంది నౌకల నిర్వాహకులు తమ ఓడలను తిప్పేందుకు ముందుకు రావటం లేదని పోర్టు అధికారులు చెబుతున్నారు. వార్ రిస్క్ ప్రీమియం వల్ల రవాణా ఖర్చు 30-50 శాతం పెరిగిందని తెలిపారు. ఈ అదనపు భారం వినియోగదారుల మీదే పడుతోంది. భారత్ నుంచి యూరప్ వైపు వెళ్లే సరుకు రవాణా నౌకలు సాధారణంగా సూయజ్ కాలువ నుంచి వెళ్తుంటాయి. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వెళ్లాల్సిన పరిస్థితి. దీని వల్ల ప్రయాణ సమయం 15-20రోజులు పెరగటమేగాక ఇంధన ఖర్చు, నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది.