Share News

మన బంగారం.. మన దేశానికి!

ABN , Publish Date - May 04 , 2026 | 04:26 AM

1,68,060 కిలోలు.. అక్షరాలా లక్షా అరవై ఎనిమిది వేల అరవై కిలోలు.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విదేశాల నుంచి మన దేశానికి తెచ్చిన మన బంగారం ఇది! గడిచిన ....

మన బంగారం.. మన దేశానికి!

  • 2025-26లో 1,68,060 కిలోల పసిడిని విదేశీ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన ఆర్బీఐ

  • 2023-24, 2024-25 సంవత్సరాల్లో కూడా లక్ష కిలోలకు పైగా పుత్తడి తరలింపు

  • యుద్ధాలతో నెలకొన్న రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం

  • మన దేశ మొత్తం పుత్తడి నిల్వ 880 టన్నులు

  • అందులో 378.95 టన్నుల పసిడి గడిచిన మూడేళ్లలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిందే

(సెంట్రల్‌ డెస్క్‌)

1,68,060 కిలోలు.. అక్షరాలా లక్షా అరవై ఎనిమిది వేల అరవై కిలోలు.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విదేశాల నుంచి మన దేశానికి తెచ్చిన మన బంగారం ఇది! గడిచిన మూడేళ్లలో ఇలా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ వంటి విదేశీ బ్యాంకుల వాల్టుల్లో మూలుగుతున్న మన బంగారాన్ని లక్ష కిలోలకు పైగా ఇక్కడకు తరలించడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. 2023-24లో 107.21 మెట్రిక్‌ టన్నులు (ఒక మెట్రిక్‌ టన్ను అంటే వెయ్యి కిలోలు), 2024-25లో 103.68 మెట్రిక్‌ టన్నుల మేర పుత్తడిని ఆర్బీఐ మన దేశానికి తీసుకొచ్చింది. తులం మేలిమి బంగారం మార్కెట్‌ రేటు ఇవాళ రూ.లక్షన్నర దాకా ఉంది! అదే కిలో బంగారం విలువ రూ.కోటిన్నర పైమాటే!! అంటే.. ఈ మూడేళ్లలో తెచ్చిన బంగారం దాదాపు 3,78,950 కిలోలు. దాని విలువ ఏకంగా రూ.5.72 లక్షల కోట్లు. ఇలా తెచ్చిన బంగారంతో.. మన మొత్తం పుత్తడి నిల్వల్లో (880.52 టన్నులు).. 77 శాతం, అంటే 680 టన్నులు మనవద్దే ఉన్నట్టయింది. మరో 197.67 టన్నుల బంగారం ఇంకా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ వద్ద ఉంది. మిగతా బంగారం వివిధ డిపాజిట్ల రూపంలో ఉంది.


విదేశాల్లో ఉంచడమెందుకు?

ప్రపంచ దేశాలకు బంగారు సంరక్షకులుగా (గోల్డ్‌ కస్టోడియన్స్‌) వ్యవహరిస్తున్న రెండు అతి పెద్ద బ్యాంకులు.. ‘ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌. వీటిలో న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వాల్టుల్లో ఏకంగా ఇలా వివిధ దేశాలకు చెందిన 5 లక్షల బంగారు కడ్డీలు (గోల్డ్‌ బార్‌) ఉన్నాయి. ఒక్కో గోల్డ్‌ బార్‌ బరువు.. 12.4 కిలోలు. అంటే ఒక్క న్యూయార్క్‌ బ్యాంకులోనే 62 లక్షల కిలోల బంగారం ఉంది. ఇక, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వాల్టుల్లో 4,30,000 బంగారు కడ్డీలున్నాయి. అంటే 53,32,000 కిలోలు!! ఈ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ప్రపంచవ్యాప్తంగా మన ఆర్బీఐ లాంటి 60 కేంద్ర బ్యాంకులకు సేవలందిస్తోంది. ఒకదేశం తనవద్ద ఉన్న బంగారాన్ని అమ్మి వెంటనే నగదు పొందాలన్నా.. వేరే దేశంతో వ్యాపారం చేయాలన్నా భౌతికంగా బంగారాన్ని తరలించడం కష్టం. అదే లండన్‌లోనో, న్యూయార్క్‌లోనో ఈ బ్యాంకుల్లో నిల్వ ఉంచితే వాటిలోని ఒక దేశ లాకర్‌ నుంచి మరో దేశ లాకర్‌లోకి మార్చడం సులువు. అందుకే ఈ ఏర్పాటు. భారతదేశం కూడా ఇలా కొంత బంగారాన్ని లండన్‌లో అట్టేపెట్టింది. కానీ.. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై, ఈ ఏడాది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పుడు.. రాజకీయంగా, భౌగోళికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు.. మన బంగారంపై మనకు మాత్రమే అధికారం ఉండాలంటే ఆ పుత్తడి మన దేశంలోనే ఉండాలి. అందుకే భారతదేశం మన పసిడిని మన దేశానికి పెద్ద ఎత్తున తీసుకొచ్చేస్తోంది. ఇంకో కారణం ఏంటంటే.. విదేశీ బ్యాంకుల్లో మన బంగారాన్ని ఉంచాలంటే అందుకు పెద్ద ఎత్తున అద్దెలు చెల్లించాల్సి వస్తుంది. మన దేశంలోనే భద్రపరచుకుంటే ఆ ఖర్చులు తగ్గుతాయి. పైపెచ్చు గతంతో పోలిస్తే మనదేశంలో పుత్తడిని అత్యంత భద్రంగా నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగింది. ఈ కారణాలన్నింటి రీత్యా.. అంతర్జాతీయ లావాదేవీల నిమిత్తం కొంత బంగారాన్ని అక్కడ ఉంచి మిగతా మొత్తాన్ని ఆర్బీఐ ఇక్కడికి తీసుకొచ్చేస్తోంది. ఒక్క మనదేశమే కాదు.. జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్‌, పోలండ్‌ ఇలా చాలా దేశాలు న్యూయార్క్‌లో, లండన్‌లో.. ఇలా వేరే దేశాల్లో ఉంచిన తమ బంగారాన్ని తమ తమ దేశాలకు తీసుకెళ్లిపోతున్నాయి.


పసిడితోనే పలుకుబడి..

సామాన్యుల నుంచి సంపన్నుల దాకా.. భారతీయులందరి దృష్టిలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు. అదో భావోద్వేగం. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే అండ. వ్యక్తులకే కాదు.. దేశాలకైనా ఇదే వర్తిస్తుంది! అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలూ ఒకప్పుడు తాము ముద్రించే కరెన్సీకి సరిపడా బంగారాన్ని నిల్వ ఉంచుకునేవి. కానీ, 1930ల్లో ప్రపంచవ్యాప్తంగా అలముకున్న ఆర్థిక మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) నేపథ్యంలో.. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత.. చాలా దేశాలు ఈ పద్ధతిని వదిలిపెట్టాయి. మధ్యలో కొన్నాళ్లు బంగారానికి డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీగా ఉండేది. కానీ, 1971లో నిక్సన్‌ దెబ్బకు ఆ రెంటికీ సంబంధం తెగిపోయాక ప్రపంచదేశాలన్నీ పూర్తిస్థాయిలో పేపర్‌ కరెన్సీ (దీన్నే ఫియట్‌ కరెన్సీ అంటారు) విధానానికి అలవాటు పడ్డాయి. అయితే.. ముద్రించే నోట్లకు సమానంగా బంగారాన్ని నిల్వ చేయట్లేదుగానీ.. మార్కెట్లో తమ కరెన్సీ విలువ పడిపోకుండా చూసుకోవడానికి, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొనడానికి బంగారాన్ని ఎప్పటికప్పుడు కొంటూ వస్తున్నాయి. భారతదేశం కూడా ఇదే క్రమంలో భారీగా బంగారు నిల్వలను కూడబెట్టింది. పెడుతూ వస్తోంది. అలా మన ఆర్బీఐ గత మూడేళ్లలో 8600 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది.

గొప్ప సంకేతం

యుద్ధాలు, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటివి వచ్చినప్పుడు ఇతరదేశాలు మన కరెన్సీని అంగీకరించకపోవచ్చు. అప్పుడు మన వద్ద ఉన్న బంగారమే మనకు దిక్కవుతుంది. 1991లో ఇలాగే మన వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు నిండుకున్నప్పుడు.. అప్పు కోసం మన బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అందులో భాగంగా తొలుత సుమారు 20 టన్నుల బంగారాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌కు, ఆ తర్వాత 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు విమానాల్లో పంపించాం. ఒక దేశానికి ఆ పరిస్థితి దాపురించిందంటే.. అది ‘ఆర్థిక అవమానమే’. అయితే, ఆ దుస్థితి మనకు ఎంతో కాలం లేదు. అప్పట్లో ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల తాకట్టు పెట్టిన బంగారాన్ని 4-5 నెలల్లోనే విడిపించుకోగలిగాం. కానీ, ఆ బంగారాన్ని భారత్‌కు తీసుకురాకుండా భద్రత, ఆర్థిక అవసరాల రీత్యా అక్కడే ఉంచాం. ఇప్పుడు మన పసిడిని అదే లండన్‌ నుంచి సగర్వంగా తెచ్చుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు గొప్ప సంకేతం.

ఏ దేశం వద్ద ఎంత బంగారం

ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలున్న దేశం అమెరికా. ఆ తర్వాతి స్థానంలో జర్మనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు ఎక్కువగా ఉపయోగించే అత్యంత విశ్వసనీయమైన వెబ్‌సైట్‌ ‘ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌’ ప్రకారం 2025 డిసెంబరు నాటికి పుత్తడి నిల్వల జాబితాలో టాప్‌-10 దేశాలు...

Updated Date - May 04 , 2026 | 04:26 AM