విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు ఊరట
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:06 AM
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వృత్తిని చేపట్టాలనుకున్న విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల (ఎఫ్‌ఎంజీ)కు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది.
దేశవ్యాప్తంగా 43,250 ఇంటర్న్‌షిప్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వృత్తిని చేపట్టాలనుకున్న విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల (ఎఫ్‌ఎంజీ)కు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను కంపల్సరీ రోటేటరీ మెడికల్ ఇంటర్న్‌షిప్(సీఆర్‌ఎంఐ) కోసం దేశవ్యాప్తంగా 43,250 సీట్లను కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్న్‌షిప్ సీట్ల కొరతపై విద్యార్థులు న్యాయస్థానాల ను ఆశ్రయించిన నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సీట్ల కేటాయింపులో కొన్ని కీలక మార్పులు చేస్తూ అన్ని రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లకు స్పష్టమైన మార్గదర్శకాలను పంపింది. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లోని అన్ని ఇంటర్న్‌షిప్ సీట్లు(100ు) విదేశీ పట్టభద్రులకే దక్కుతాయి. అలాగే, 2022-23 నుంచి 2025-26 మధ్యకాలంలో అదనంగా పెరిగిన సీట్లన్నీ విదేశీ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. కాగా, సీట్ల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు గణనీయమైన వాటా దక్కింది. తెలంగాణలో మొత్తం 4,871 సీట్లు అందుబాటులోకి రాగా, ఏపీలో మొత్తం 2,271 సీట్లను ఎఫ్‌ఎంజీల కోసం కేటాయించారు.