చలో లోక్‌భవన్ ఉద్రిక్తం!
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:01 AM
: ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట ఇండీ కూటమి నేతలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ కొనసాగింది.
టీపీసీసీ చీఫ్, మంత్రులు సహా ఇండీ కూటమి నాయకుల అరెస్టు
సర్ అవకతవకలు, అగ్ర నేతల అరెస్టుపై నిరసన
లోక్ భవన్‌కు భారీ ర్యాలీ
జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్
లోక్‌భవన్ దగ్గరలో అడ్డుకున్న పోలీసులు
బ్యారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు కార్యకర్తల యత్నం
పోలీసులతో పెనుగులాడిన నాయకులు, మంత్రులు, కార్యకర్తల అరెస్టు
హైదరాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట ఇండీ కూటమి నేతలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. టీపీసీసీ చీఫ్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వామపక్ష నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని నినదించారు. ‘సర్’ ప్రక్రియపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రాహుల్, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీనికి వామపక్షాలు మద్దతు పలికాయి. ఇందులో భాగంగా ఇండీ కూటమి నాయకులు, కార్యకర్తలు ఉదయం పది గంటలకే నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారిలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ, పోటు రంగారావు తదితరులు ఉన్నారు.
అక్కడి నుంచి లోక్ భవన్‌కు భారీ ర్యాలీ కొనసాగింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని, తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలంటూ ఇండీ కూటమి నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ర్యాలీ ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా లోక్‌భవన్ వైపు కొనసాగింది. అయితే, లోక్‌భవన్‌కు 300 మీటర్ల దూరంలో రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఇండీ కూటమి నాయకుల ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బ్యారికేడ్లను దాటుకుని లోక్‌భవన్ వైపునకు వెళ్లేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు యత్నించారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై మంత్రులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు, కార్యకర్తలు మరో దారిలో లోక్‌భవన్ వద్దకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను, మంత్రులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్ సావంత్, కోదండరాంను బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వామపక్ష నాయకులు కూనంనేని, పోటు రంగారావు, ఎంఎం హన్మేశ్, జాన్‌వెస్లీ తదితరులను ఆసి్‌ఫనగర్, చిక్కడపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. టీపీసీసీ చీఫ్, మంత్రులు పోలీస్ స్టేషన్లోనే కొంతసేపు తమ నిరసనను కొనసాగించారు. తర్వాత టీపీసీసీ చీఫ్, మంత్రులు తమ నిరసనను విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
జ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా
పోరాటం: మంత్రి పొంగులేటి
రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, అంతవరకూ తమ పోరాటం ఆగదని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకుపైగా ఓట్లను తొలగించడం సరికాదన్నారు. ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించడం లేదన్నారు. స్థానిక ఓటరు నమోదు అధికారుల అధికారాలను బలహీనపరిచేలా ఈసీనెట్ వ్యవస్థను వినియోగించారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించకుండా అధికార పక్షానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
ఓటు హక్కును కాలరాసే కుట్ర: జూపల్లి
ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిపోయే వరకూ, జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఓటు విలువ కాపాడటంలో రాజీ లేదు: అడ్లూరి
ఓటు హక్కు విలువను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడేది లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండీ కూటమి పోరాటానికి ప్రతి పౌరుడూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొంటున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలన్నారు.
కమిషన్‌పై ఓటుహక్కును
కాపాడాల్సిన బాధ్యత: మంత్రి పొన్నం
ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక, ఇండీ కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఓటు హక్కును హరిస్తున్న బీజేపీ కుట్రను అడ్డుకోవాలన్నారు.
మోదీ సర్కార్ జవాబు చెప్పాలి: వాకిటి శ్రీహరి
దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్న మోదీ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ‘‘అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, స్వతంత్రతపై వచ్చిన ఆరోపణలకు కమిషన్ సమాధానం చెప్పాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.
సీఈసీ ఇంకా కొనసాగడం సరికాదు: మహేశ్ గౌడ్
దేశంలో ప్రస్తుతం ప్రధాని మోదీ ఫాసిస్టు పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగడం సరికాదన్నారు. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఈసీ జ్ఞానే్‌షకుమార్.. మోదీ, అమిత్ షా చెప్పినట్లుగా నాట్యం చేస్తున్నారన్నారు.