హంగ్‌లో కింగులైన స్వతంత్రులు
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:37 AM
తాజా పురపోరులో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో మూడు మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో.. స్వతంత్ర అభ్యర్థులే కింగులయ్యారు
ఆదిలాబాద్, భైంసా, జమ్మికుంటలో అనూహ్య పరిణామాల నడుమ చైర్మన్లుగా ఎన్నిక
ఆదిలాబాద్, జమ్మికుంట/జమ్మికుంట, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): తాజా పురపోరులో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో మూడు మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో.. స్వతంత్ర అభ్యర్థులే కింగులయ్యారు. చైర్మన్ పదవులను దక్కించుకున్నారు! అయితే, చైర్మన్లుగా ఎన్నికయ్యాక.. ఆ ముగ్గురిలో ఒకరు కాంగ్రె్‌సలో చేరగా, మరొకరు బీఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంఐఎం అత్యధిక స్థానాలు దక్కించుకున్న భైంసాలో.. కాంగ్రె్‌సకు అత్యధిక స్థానాలు వచ్చిన ఆదిలాబాద్ మునిసిపాలిటిలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో స్వతంత్రులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు.
ఫలితాలు వెలువడిన నాటి నుంచి తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఆదిలాబాద్ మునిసిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. 21 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీయే ఇక్కడ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా అంచనా వేశారు. కానీ.. అధికార కాంగ్రెస్ ఈ మునిసిపాలిటీపై దృష్టి సారించడంతో పరిస్థితులు తారుమరయ్యాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఎంఐఎం అభ్యర్థి ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థుల మద్ధతు కూడగట్టడంలో బీజేపీ విఫలమైంది. అయితే.. ఆదిలాబాద్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనూష.. సోమవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు.
భైంసాలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్..
ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ వ్యూహాలతో.. భైంసా బల్దియాలో మజ్లిస్ ఆదిపత్యానికి బ్రేక్ పడింది. వరుసగా మూడోమారు ఆ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలనుకున్న ఎంఐఎం ఆశలు అడియాసలయ్యాయి. ఆ పార్టీని నిలువరించేందుకు అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ జత కట్టాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఎంఐఎం కోటకు గండికొట్టాయి. ఇక్కడ 26 వార్డులకు ఎంఐఎం 12, బీజేపీ 6 స్థానాలను, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. మిగతా వార్డులలో బీజేపీ రెబల్స్ స్వతంత్రులుగా 5 స్థానాలలో, మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు మరో రెండుచోట్ల విజయం సాధించారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ సారథ్యంలో వీరంతా జత కట్టారు. బీజేపీ రెబెల్‌గా బరిలోకి దిగిన 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి తూమొల్ల దత్తాత్రిని చైర్మన్‌గా, 25వ వార్డు స్వతంత్ర సభ్యురాలు బీబీ ఖుతిజ సిద్దిఖీ వైస్ చైర్మన్‌గా బరిలోకి దింపి గెలిపించుకున్నారు.
జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపల్ చైర్మన్ పీఠం.. అనూహ్య మలుపులు, నాటకీయ పరిణామాల మధ్య అక్కడ 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన మొలుగు ప్రశాంత్‌కుమార్(దిలీప్)కు దక్కింది. వైస్ చైర్మన్‌గా ముంతాజ్ అలీ మహమ్మద్ ఎన్నికయ్యారు. జమ్మికుంట మునిసిపాలిటీలో కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకోగా.. బీఆర్‌ఎస్ 12, బీజేపీ 4 చోట్ల గెలుపొందాయి. స్వతంత్రులు ముగ్గురు, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడొకరు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో.. ఫలితాలు వెలువడిన రోజు నుంచే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయు. తొలుత కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఇండిపెండెంట్లు మొలుగు ప్రశాంత్‌కుమార్, మరో ఇద్దరు, ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ కాంగ్రెస్ క్యాంపు నుంచి కరీంనగర్‌కు చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సోమవారం ఉదయం పదిన్నరకు ప్రశాంత్‌కుమార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆరెస్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. తమ క్యాంపులో ఉండి బీఆర్‌ఎస్ వైపు ఎలా వెళతారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశాంత్‌కుమార్, ఇతర సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కౌన్సిలర్లను వారి నుంచి విడిపించి తమవైపు తీసుకెళ్లారు. 12.30గంటలకు చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. బీఆర్‌ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు చైర్మన్‌గా ప్రశాంత్‌ను ప్రతిపాదించారు.
బీఆర్‌ఎస్ సభ్యులు 12మంది, ఇండిపెండెంట్లు ముగ్గురు, కాంగ్రెస్ 10 మంది.. ఇలా మొత్తం 25మంది మద్దతుతో ప్రశాంత్‌కుమార్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ముంతాజ్ మహమ్మద్ అలీని బీఆర్‌ఎస్ సభ్యులు 12మంది, ఇండిపెండెంట్లు ముగ్గురు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో 16మంది ఎన్నుకున్నారు. ప్రశాంత్ బీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా.. కండువా తీసి ప్రమాణం చేశారు. కానీ.. ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం గమనార్హం.