kumaram bheem asifabad- పెరిగిన విద్యుత్ వినియోగం
ABN , Publish Date - May 13 , 2026 | 10:54 PM
మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నుంచి ఎండలు పెరిగాయి. ఏప్రిల్ నెలలో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. మే ప్రారంభంలోనే 45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు సతమతమవుతున్నారు
- ఏప్రిల్‌లో గృహజ్యోతి పథకానికి 4,874 మంది దూరం
- మే నెలలో మరింత పెరిగే అవకాశం
ఆసిఫాబాద్‌రూరల్, మే 13 (ఆంధ్రజ్యోతి): మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నుంచి ఎండలు పెరిగాయి. ఏప్రిల్ నెలలో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. మే ప్రారంభంలోనే 45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలోనూ కుదురుగా ఉండలేని పరిస్థితి. చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లపై ఆదారపడటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. దీంతో చాలా మంది గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. రెండు నెలల్లోనే జీరో బిల్లు లబ్ధిదారుల సంఖ్య వేలల్లో తగ్గిపోయారు. ఇక మే నెలలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- 200 యూనిట్లు లోపు..
రాష్ట్ర ప్రభుత్వం దారిధ్య్ర రేఖకు దిగువ ఉన్న విద్యుత్ వినియోగదారులకు గృహ జ్యోతి పథకంలో భాగంగా గృహ అవసరాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఆ పరిధిలోపు విద్యుత్ వాడితే బిల్లు కట్టాల్సి ఉండదు. నెలలో 200 యూనిట్లకు మించి ఒక యూనిట్ అదనంగా వినియోగించినా పూర్తిస్థాయిలో బిల్లు చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఎండల తీవ్రతను తట్టుకోలేక ఇళ్లలో విద్యుత్ విని యోగం గణనీయంగా పెరుగుతుంది. ఉక్కపోతకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లను ఆధి కంగా వాడుతుండడంతో 250 నుంచి 300 యూనిట్ల పరిధి దాటుతోంది. గృహజ్యోతి విని యోగదారులు జీరో బిల్లుకు దూరమవుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిల్లో మొదటి కేటగిరి విద్యుత్ కనెక్షన్లు 1.19 లక్షలు ఉన్నాయి. మార్చిలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 81,851 ఉండగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన 80,025 మంది జీరో బిల్లు పొందారు. ఏప్రాల్ రెండో వారం నుంచి ఎండలకు విద్యుత్ వాడకం పెరిగి 4,874 మంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఏప్రిల్‌లో గృహజ్యోతి లబ్ధిదారులు 81,851 మంది ఉండగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన లబ్దిదారుల సంఖ్య 76,977కు పడిపోయింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 4,874 మంది లబ్ధిదారులు గృహజ్యోతి సబ్సిడీకి దూరమ య్యారు. మే మొదటి వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటాయి. ప్రస్తుతం రెండు, మూడు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. విద్యుత్ కోతలు సైతం విధించడంతో కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గింది. కానీ మళ్లీ ఎండలు పెరిగితే విద్యుత్ వాడకం గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. మే నెలలోనూ గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.
- పొదుపు పాటిస్తే..
లబ్ధిదారులు 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తే పూర్తి బిల్లు చెల్లించాల్సి వస్తుంది. తద్వారా నెలకు రూ. 900 నుంచి రూ. 1000 వరకు బారం పడుతుంది. లబ్ధిదారులు తప్పనిసరిగా పొదుపు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి ఎలకా్ట్రనిక్ వస్తువులు వాడకుండా ఉంటే మంచి ది. ఇళ్లలో సాధారణ బల్బులకు బదులు తక్కువగా ఎల్‌ఈడీ బల్బులు వినియోగిం చుకోవాలి. గదిలో అవసరమైతేనే ఫ్యాన్లు, లైట్లు వాడుతూ ఎవరు లేని సమయంలో ఆఫ్ చేయాలి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు బదులు ప్రెషర్‌కుక్కర్లను వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుందని చెబుతున్నారు.
విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి..
- ఉత్తమ్‌జాడే, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఆధిక విద్యుత్ వినియోగించడంతో కొంతమంది లబ్ధిదారులు పథకా నికి దూరమవుతున్నారు. 200 యూనిట్లు దాటితే ఆ నెలలో పూర్తి బిల్లు వినియోగదా రులు చెల్లించాల్సిందే. పొదుపుగా విద్యుత్ వాడుకుంటే గృహజ్యోతి ప్రయోజనం చేకూరుతుంది.