నేడు ఆదాయపు పన్ను శాఖ ‘ప్రారంభ్-2026’
ABN , Publish Date - May 08 , 2026 | 07:10 AM
ఆదాయపు పన్ను శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘ప్రారంభ్ 2026’’ పేరుతో మెగా పన్ను చెల్లింపుదారుల అవగాహన కార్యక్రమం శుక్రవారం జరగనుంది.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి) : ఆదాయపు పన్ను శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘ప్రారంభ్ 2026’’ పేరుతో మెగా పన్ను చెల్లింపుదారుల అవగాహన కార్యక్రమం శుక్రవారం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్, రోడ్ నం.12, మెహదీ మంజిల్‌లోని అమరావతి ఆడిటోరియంలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆదాయపు పన్ను చట్టం-2025పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) సభ్యుడు సంజయ్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. శాఖ సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. సరళీకృత ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ‘‘ప్రారంభ్ 2026’’ నిర్వహిస్తున్నారు. ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మరో 22 ప్రాంతాల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఒకేసారి నిర్వహిస్తున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.