Share News

ఇవిగో మీ లావాదేవీలు ఇంత పన్ను కట్టాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:47 AM

బాగా సంపాదించండి. సక్రమంగా ఆదాయ పన్ను కట్టండి. పన్ను సమస్యలకు దూరంగా ఉండండి’’.. అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా నియమితులైన సీనియర్‌ ఐఆర్‌ఎస్‌....

ఇవిగో మీ లావాదేవీలు ఇంత పన్ను కట్టాలి

  • పన్ను చెల్లింపుదారులకు ఈ వివరాలు ముందే ఇస్తాం

  • బాగా సంపాదించండి.. సక్రమంగా పన్నులు కట్టండి

  • ఫార్మా, స్థిరాస్తి, ఐటీ రంగాల నుంచే ప్రధాన రాబడి

  • ఆదాయ వృద్ధి లక్ష్యం 14 శాతం .. యుద్ధం, ఐటీ మందగమనంతో ఆ లక్ష్యం 8 శాతానికి పరిమితం

  • లావాదేవీలపై నిఘా.. 70 శాతం మంది పన్ను చెల్లిస్తున్నారు

  • తెలంగాణ, ఏపీ ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ సురేశ్‌ బత్తిని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘బాగా సంపాదించండి. సక్రమంగా ఆదాయ పన్ను కట్టండి. పన్ను సమస్యలకు దూరంగా ఉండండి’’.. అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా నియమితులైన సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి సురేష్‌ బత్తిని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతలు నిర్వర్తించిన అనిల్‌కుమార్‌ పదవీ విరమణ చేయడంతో.. ప్రభుత్వం సురేష్‌కు పదోన్నతి కల్పించి ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు..

పన్ను చెల్లించనివారిని వదిలేసి.. పన్ను చెల్లించినవారిని కూడా ఒకటి, రెండు లావాదేవీలు మిస్‌ అయ్యాయంటూ నోటీసుల పేరుతో ఇబ్బంది పెడతారనే ఆరోపణ ఐటీ శాఖపై ఉంది.. మీరేమంటారు?

పన్ను చెల్లించేవారిని ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా చూసుకోవాలన్నదే మా ఉద్దేశం. అయితే ఒక్కోసారి వారి ఆర్థిక లావాదేవీలను పరిశీలించినప్పుడు.. వారు జరిపిన లావాదేవీలకు అనుగుణంగా పన్ను చెల్లించలేదనే అనుమానం వస్తే నోటీసులిస్తాం. అది తప్పదు. అయితే పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అనుమానాలున్నా, సమస్యలున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయకార్‌ భవన్‌ల వద్ద సందేహాల నివృత్తికి ఏర్పాట్లు చేశాం.

కొత్త ఆదాయపన్ను చట్టం ఈ ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చింది. పాత చట్టానికి, కొత్త చట్టానికి ఉన్న తేడాలేంటి?

కొత్త చట్టంలో పన్నుల మదింపు, చెల్లింపులను సరళీకృతం చేశాం. ఒక్కోసారి ఒకటి, రెండు లావాదేవీలు మిస్‌ అయ్యాయని, వాటిని అసె్‌సమెంట్‌లో చూపలేదని, వాటికి పన్ను చెల్లించలేదని పన్నుచెల్లింపుదారులకు నోటీసులు వస్తుంటాయి. ఇకపై అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు.. వారు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన లావాదేవీలు ఏంటి? వాటి వివరాలు? వాటికి ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది? అన్న వివరాలను ముందే అందిస్తాం. పన్ను కట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో లాగిన్‌ అయినప్పుడు ఈ వివరాలు మీకు కనిపిస్తాయి. వీటిని ఒకసారి చూసుకుని.. ఏ లావాదేవీనీ మిస్‌ చేయకుండా అన్నింటి కీ కలిపి పన్ను మదింపు చేసి రిటర్న్‌ ఫైల్‌ చేసే అవకాశం ఉంటుంది. గతంలో అయితే.. ఏదైనా ఒక లావాదేవీని చూపించకుండా ఫైల్‌ చేస్తే.. మళ్లీ దానికి నోటీసులు, పన్ను వసూలు, జరిమానాలు ఉండేవి. ఇప్పుడు ముందుగానే సమాచారం ఉండడంతో పన్ను చెల్లింపుదారులు ఆ ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు.


ఈ సమాచారాన్ని ఐటీ రిటర్న్స్‌ దాఖలు సమయంలో అందుబాటులో ఉంచుతారా? ముందుగానే పోర్టల్‌లో పొందుపరుస్తారా?

ఈ సమాచారం ఆర్థిక సంవత్సరం ముగిసిన ఒక నెల రోజుల్లో అందిస్తాం. అంటే మే, జూన్‌ నాటికి అందిస్తాం. ఆ తర్వాత రిటర్నుల దాఖలుకు ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ వివరాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనవసర పన్ను కేసులు ఉండవు. ఈ విధానంతో పన్ను చెల్లింపుదారును సాధికారికం చేస్తామని చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను వృద్ధి రేటు లక్ష్యం 14 శాతం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతున్నారా?

లక్ష్యం అంతమేరకు పెట్టుకున్నాం. అయితే సుమారు 8 శాతం ఆదాయ వృద్ది సాధించగలుగుతున్నాం. ఆర్థిక వ్యవస్థ కొంత మందగించడం, అమెరికా-ఇరాన్‌ యుద్ధం వంటివి ఇందుకు కారణాలు. ఇంకో కీలక కారణం ఉంది. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12.5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల కూడా వృద్ధిరేటు కొంత మేర తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను ప్రధానంగా మూడు రంగాల నుంచే వస్తోంది. ఒకటి ఫార్మా, రెండు రియల్‌ ఎస్టేట్‌, మూడు ఐటీ కంపెనీలు-ఉద్యోగులు. ఇవన్నీ ఒకదానికొకటి అంతర్గత సంబంధం ఉన్నవే. యుద్ధం వల్ల ఫార్మాపై కొంచెం ప్రభావం పడింది. ఐటీ రంగం ప్రభావం ఇప్పుడు లేదు. కానీ వచ్చే ఏడాది ఆదాయంపై అది పడుతుంది. ఐటీ రంగం బాగుంటేనే రియల్‌ ఎస్టేట్‌ బాగుంటుంది. ఈ పరిణామాలన్నీ ఒక్కోసారి వృద్ధిరేటుపై ప్రభావం చూపుతాయి.


ఆదాయపన్ను కట్టాల్సినంత ఆదాయంలో ఉన్నవారంతా రిటర్న్‌లు వేస్తున్నారా? పన్నులు కడుతున్నారా? కట్టేవారి సంఖ్య పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా?

ఆదాయపు పన్ను కట్టాల్సిన బ్రాకెట్‌లో ఉన్నవాళ్లలో 70 శాతం వరకూ పన్ను కడుతున్నారు. వాళ్లు కట్టేలా చేస్తున్నాం. బ్యాంకు లావాదేవీలు ఆటోమేటిక్‌గా మా శాఖకు తెలుస్తాయి. ఒక నిర్ణీత పరిమితి మించి క్రెడిట్‌ కార్డులు వాడినవారు, ఆస్తులు కొనుగోలుచేసినవారి సమాచారం మాకు అందుతోంది. అయితే నగదు లావాదేవీలు చేసే మిగతా 30శాతం మంది పన్ను కట్టకుండానే ఉంటున్నారు.

ఐటీ శాఖలో కేసుల పరిష్కారానికి ముఖాముఖి మాట్లాడే పద్ధతి కాకుండా ఫేస్‌లెస్‌ అసెస్‌‌మెంట్‌ సిస్టమ్‌ని తీసుకొచ్చారు కదా! మీ సిబ్బంది ఈ పద్ధతికి అలవాటుపడ్డారా?

ఐటీ కేసులను ఒక అధికారికి అప్పగించి.. ఆ అధికారి సదరు పన్ను చెల్లింపుదారులు/ఎగవేతదారులతో మాట్లాడే పద్ధతికి దీని ద్వారా చెక్‌ పెట్టాం. అధికారులు వ్యక్తిగతంగా ఎవరికీ లబ్ధి చేకూర్చకుండా ఉండడానికి, అక్రమాలను నివారించడానికి ఈ పద్ధతిని తీసుకొచ్చాం. దీనిలో ర్యాండమ్‌గా అధికారులకు కేసులు అప్పగిస్తాం. పన్ను మదింపులు డిజిటల్‌గా చేస్తాం. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. అయితే ఈ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల్ని ప్రేరేపించాలి. అది ప్రస్తుతం మా ముందున్న ఒక లక్ష్యం.

Updated Date - Apr 10 , 2026 | 05:47 AM