kumaram bheem asifabad- ఎడతెరపి లేని వర్షం
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:46 PM
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. బెజ్జూరు మండలంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవుతల ఉన్న గ్రామాలైన సుశ్మీర్, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, పాతసోమిని, నాగేపల్లి, బండలగూడ, గెర్రెగూడ తదితర గ్రామాలకు సాయంత్రం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
బెజ్జూరు/కాగజ్‌నగర్/సిర్పూరు/(టి)/కౌటాల/పెంచికల్‌పేట/దహెగాం, జూలై 4 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. బెజ్జూరు మండలంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవుతల ఉన్న గ్రామాలైన సుశ్మీర్, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, పాతసోమిని, నాగేపల్లి, బండలగూడ, గెర్రెగూడ తదితర గ్రామాలకు సాయంత్రం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒర్రెలపై వంతెనల నిర్మాణం లేని కారణంగా ఏటా వర్షాకాలంలో అవస్థలు తప్పడం లేదు. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం సమాయత్తమైన రైతుల పంటలకు ఊపిరి పోసిందని చెబుతున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం నుంచి 10 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు కురిసింది. దీంతో వివిధ కాలనీల్లో రోడ్లపై నీరు చేరింది. అలాగే చిరు వ్యాపారులకు పూర్తిగా అంతరాయం కలిగింది. సిర్పూరు(టి) మండలంతో పాటు వివిధ గ్రామాల్లో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వివిధ రోడ్లల గుంతల్లో నీరు చేరడతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. కౌటాల మండల కేంద్రంలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పెంచికల్‌పేటలో కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి శనివారం ఉదయం నుంచి వర్షం కురువడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో పత్తి విత్తనాలు వేసిన రైతులు పంట మొలకలకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతాయని ఆనంద వ్యక్తం చేశారు. పోతపల్లి అంగన్వాడి కేంద్రంలోకి వర్షం నీరు చేరగా, బొంబాయిగూడ పలు చోట్ల నీరు నిలువటంతో స్థానికులు అవస్థలు పడ్డారు. వర్షం నీరు నిల్వకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దహెగాం మండలంలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దహెగాం-కోత్మీర్ మధ్యలో ఉన్న డబుల్ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. శనివారం యూరియా లోడ్‌తో వెళ్లుతున్న లారీ కూరుక పోయింది. ఒక వైపు బురదరోడ్డు, మరో వైపు వాహనాలు రాకపోకలకు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.