పదేళ్లుగా పాత భవనంలోనే
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:33 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుంబంధ సంస్కృత పాఠశాల పదేళ్లుగా కొనసాగుతోంది.
ఆండాళ్ నిలయంలో సంస్కృత పాఠశాల విద్యాబోధన, వసతి గృహం
రోడ్డు పక్కన ఉండడంతో శబ్ధ కాలుష్యంతో ఏకాగ్రతకు ఆటంకం
యాదగిరిగుట్ట, మార్చి 29(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుంబంధ సంస్కృత పాఠశాల పదేళ్లుగా కొనసాగుతోంది. కొండపైన స్వామివారి చెంత 1952లో నెలకొల్పిన పాఠశాల తొలుత ఐదుగురు విద్యార్థులతో మొదలై ఇప్పుడు 69మందికి చేరింది. ఆరో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యా యులతో విద్యాబోధన కొనసాగుతోంది. పట్టణంలో దేవస్థానానికి చెందిన ఆండాళ్ సదనంపై అంతస్థులో వీరికి ఆరు గదుల్లో తరగతులు, 10గదుల్లో వసతి కల్పిస్తున్నారు. కిచెన్ సామాగ్రి అందుబాటులో ఉన్న పాత భవనంలోనే (ప్రస్తుత భవనం వెనుక) భోజన వసతి కల్పిస్తున్నారు. పట్టణంలోని పాత జిల్లాపరిషత్ పాఠశాల (పాత బస్టాండు ఎదురుగా) మైదానంలో పదేళ్ల క్రితం ఆలయ పునఃని ర్మాణంలో భాగంగా పాత భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో ఆరు (గత ఆక్టోబరు) నెలల క్రితం అప్పటికే మూసేసిన ఆండాళ్ సదన భవన సముదాయంలో సంస్కృత పాఠశాల కొనసాగుతోంది. ఈ భవన సముదాయం ప్రధాన రహదారి పక్కన ఉండడంతో శబ్ధ, వాయు కాలుష్యంతో విద్యార్థుల ఏకాగ్రతకు ఆటంకం కలుగుతోంది. భోజన వసతి భవనం వెనుక భాగంలో ఉన్నందున రోడ్డుపై నుంచే విద్యార్థుల రాకపోకలు సాగిస్తున్నారు.
శాశ్వత భవనం నిర్మిస్తాం
పాతగుట్టకు వెళ్లే దారిలో 1.03ఎకరాల దేవస్థానం భూమిలో సంస్కృత పాఠశాలకు శాశ్వత భవనం నిర్మిస్తాం. సంస్కృత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం గుండ్లపల్లి రెవెన్యూ 176/2లోని భూమిలో త్వరలో నిర్మిస్తాం. ప్రశాంత వాతావరణంలో విద్య అభ్యసించే విధంగా భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
జే. భవానీశంకర్, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో.