kumaram bheem asifabad-ఎల్నినో ప్రభావం.. మిర్చి పంటకు ముప్పు
ABN , Publish Date - Nov 03 , 2026 | 10:29 PM
ఎల్నినో ప్రభావం మిర్చి రైతులను కలవర పెడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఇంకోవైపు పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకుతుండటంతో మిర్చి సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడు తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- పెరుగుతున్న పెట్టుబడి భారం
- తెగుళ్ల ఉధృతితో రైతుల్లో ఆందోళన
ఆసిఫాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావం మిర్చి రైతులను కలవర పెడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఇంకోవైపు పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకుతుండటంతో మిర్చి సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడు తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో పంటకు సరైన దిగుబడి రాకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
- మూడు వేల ఎకరాల్లో సాగు..
జిల్లాలో వానాకాలంలో మూడు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. కానీ ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు అడుగుంటి పోతుండడంతో పాటు తెగుళ్లు సోకడం వల్ల పంట ఎదుగుదులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సారి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని యంత్రాంగం సూచించినప్పటికీ రైతులు అధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం పంటకు అనుకూల పరిస్థితులు లేక పోవటంతో వారిని కలవరపెడుతోంది. జిల్లాలో గతేడాది సుమారు 1,900 వందల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. కానీ ఈ ఏడాది సుమారు 3వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రధానంగా సిర్పూరు డివిజన్ పరిఽధిలోని కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట్ మండలాల్లో అత్యధికంగా 1,200 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొని బోర్లు, బావుల్లో నీటి లభ్యత తగ్గడంతో అన్నదాతల ఆశలు అడుగంటితున్నాయి. పంటను కాపాడుకునేందుకు అపసోపాలు పడుతున్న రైతులకు నీటి సమస్యకు తోడు కొమ్మకుల్లు, ఆకు మడత వంటి తెగుళ్లు చీడ పీడలు కన్పిస్తుండడం ఆందోళన గురి చేస్తోంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వారికి నివారణ చర్యలకు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. అధికారులు పంటలను పరిశీలించి సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు.
- వాతావరణ మార్పులతో..
వాతావరణంలో వస్తున్న మార్పులు మిర్చి పంటకు మరో సమస్యగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, తేమ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశిస్తు న్నాయని రైతులు చెబుతున్నారు. పంటను కాపాడుకునేందుకు పురుగుమందులు, ఇతర నివారణ చర్యల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో పెట్టుబడి భారం పెరిగింది. దీనికి తోడు తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేయాల్సి రావడంతో సాగు వ్యయం మరింత పెరుగుతోంది. అయినప్పటికీ పంట ఆశించిన స్థాయిలో ఎదగకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా గతేడాది అనుకూల వాతావరణం, మంచి ధరలు కలిసి రావడంతో మిర్చి రైతులకు కొంతమేర లాభాలు వచ్చాయి. ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతోపాటు క్వింటాకు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. దీంతో ఈసారి కూడా మంచి ఆదాయం వస్తుందని ఆశించి పలువురు రైతులు మిర్చి సాగు చేపట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సాగు ఖర్చులు పెరుగుతున్నా దిగుబడిపై స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. చివరకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోతే పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.
మర్చి పంటను దెబ్బతీశాయి..
- డెబ్బటి మహేష్.,రైతు, పెంచికల్పేట్
వాతావరణ పరిస్థితులు మర్చి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి సగానికి సగం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఎరువులు, పురుగుల మందులు, కూలీల కోసం భారీగా పెట్టుబడి పెట్టాం. దిగుబడిపై ఆశలు సన్నగిల్లుతుండడంతో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అనే ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం పరిస్థితిని పరిశీలించి మిరప రైతులను ఆదుకోవాలి.