రానున్న 2 వారాలు వర్షాలే
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో వచ్చే రెండు వారాల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన నేపథ్యంలో..
రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి
పలు జిల్లాల్లో నేడు, రేపు వానలు
సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో దంచికొట్టిన వాన
అత్యధికంగా 17సెంటీమీటర్ల వర్షం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
జూన్‌లో తెలంగాణలోని18 జిల్లాల్లో40శాతం లోటు వర్షపాతం: ఐఎండీ
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే రెండు వారాల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. బుధ, గురు వారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా, సోమవారం అర్ధరాత్రి తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. రాజధాని హైదరాబాద్‌తోపాటు పెద్దపల్లి జిల్లాలో కుండపోతను తలపించింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కునారంలో అత్యధికంగా 17.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి, శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, హైదరాబాద్ పరిధిలోని చందానగర్‌లో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 మండలాల్లో వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉండగా, జూన్ నెలలో తెలంగాణలోని 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన వర్షపాత వివరాలతో కూడిన మ్యాప్‌ను ఐఎండీ విడుదల చేసింది. అందులో తెలంగాణలో 40శాతం మేర లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్త సగటు సాధారణ వర్షపాతం 130మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 81.4మిల్లీమీటర్లే నమోదైనట్లు పేర్కొంది. వరంగల్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదవగా, మంచిర్యాల, గద్వాల, కామారెడ్డి, మేడ్చల్, ఆసిఫాబాద్, భువనగిరి, మెదక్, నిర్మల్, జనగామ, సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.