Share News

నాలుగైదు రోజుల్లో తెలంగాణకు ‘నైరుతి’

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:34 AM

నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, ఒడిసా, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు భారత...

నాలుగైదు రోజుల్లో తెలంగాణకు ‘నైరుతి’

  • ఒడిసా, ఝార్ఖండ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌కూ రుతుపవనాల విస్తరణ?

  • వచ్చేవారం ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

  • అత్యంత బలమైన ఎల్‌నినో.. అమెరికా శాస్త్రవేత్తల అంచనా

న్యూఢిల్లీ, జూన్‌ 18: నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, ఒడిసా, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వచ్చేవారం ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం వల్ల రుతుపవనాల పురోగతి మందగించి దేశంలోని చాలా ప్రాంతాలు ఇంకా పొడిగానే ఉన్నాయని తెలిపింది. మూడింట రెండొంతుల జిల్లాలు ఇప్పటికి వర్షపాతం లోటు, లేదా తీవ్ర లోటుతో ఉన్నాయని వివరించింది. 741 జిల్లాలకుగాను 239 జిల్లాల్లో లోటు వర్షపాతం, 230 జిల్లాల్లో వర్షపాతం తీవ్రలోటు నెలకొన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈనెల 24వ తేదీ వరకు యూపీ, 20వ తేదీ వరకు తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, మరాట్వాడ, విదర్భ ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. కాగా, ఎల్‌నినో ప్రభావంతో దక్షిణాసియాలో పొడి వాతావరణం నెలకొంటుందని అమెరికాకు చెందిన బ్లూంబర్గ్‌ సంస్థ తెలిపింది. ఇది అత్యంత బలమైన ఎల్‌నినోగా రికార్డులకు ఎక్కనున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 03:34 AM