రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:31 AM
నిషేదిత నకిలీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తది తర రాష్ట్రాల నుంచి హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) కాటన్ విత్తనాలను దిగుమతి చేసుకొని రహస్య...
ఇప్పటికే రహస్య ప్రదేశాలకు తరలింపు
ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో డంపులు
సుమారు 10 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాల దిగుమతి
హైదరాబాద్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): నిషేదిత నకిలీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తది తర రాష్ట్రాల నుంచి హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) కాటన్ విత్తనాలను దిగుమతి చేసుకొని రహస్య ప్రదేశాలకు తరలించటానికి అక్రమార్కు లు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ పత్తి విత్తన డంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. వానాకాలం సాగు సీజన్ మొదలయ్యేలోపు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు నకిలీ విత్తనాలను తరలించేందుకు, తొలకరి వర్షాలు పడగానే రైతులకు అంటగట్టేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఏటా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. ఇందులో 20 శాతం సాగుకు(10లక్షల ఎకరాలకు) సరిపడేలా నిషేదిత హెచ్‌టీ పత్తి విత్తనాలను సరఫరా చేయటమే లక్ష్యంగా అక్రమార్కులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గోనెసంచులతో పాటు వివిధ మార్గాల్లో నిషేదిత విత్తనాలు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌కు ప్రతియేటా టన్నుల కొద్దీ నకిలీ పత్తి విత్తనాలు వస్తున్నాయి. కర్ణాటక సరిహద్దులో ఉన్న నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో నిషేదిత పత్తి విత్తనాల డంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో కొంతమేరకు హెట్‌టీ కాటన్ విత్తనాలు నిల్వ చేస్తున్నారు. తొలకరి వర్షాలు పడగానే పత్తి రైతులకు వీటిని అంటగట్టాలనే లక్ష్యంతో వ్యాపారులు, దళారులు పనిచేస్తున్నారు. తనిఖీలు లేకపోవటంతో అనుకున్నచోటికి తరలిస్తున్నారు. నగర శివారుల్లోని మేడ్చల్, శంషాబాద్, ఘట్ కేసర్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాల నిల్వలు భారీగా ఉన్నట్లు సమాచారం.
తనిఖీలు చేస్తే బండారం బట్టబయలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ ప్రాంతంలో 30 క్వింటాళ్ల నిషేదిత పత్తి విత్తనాలను పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకు న్నారు. వీటి విలువ రూ.30లక్షలు ఉంటుందని కుత్బుల్లాపూర్ జోన్ పోలీసు అధికారులు ప్రకటించారు. నకిలీ విత్తనాల బస్తాలపై క్యాబేజీ బస్తాలను వేసి గుట్టుగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.