Share News

జీవ జలమా.. చేదు విషమా? మంజీర నది చుట్టూ అక్రమ చేపల చెరువులు..

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:26 AM

మంజీర నదిని ఆనుకుని ఏర్పాటు చేసిన వందకుపైగా చేపల చెరువులు.. ఒక వైపు కాలుష్యాన్ని వెదజల్లుతూ, మరో వైపు సింగూరు ప్రాజెక్టు నీటిని మింగేస్తున్నాయి.

జీవ జలమా.. చేదు విషమా? మంజీర నది చుట్టూ అక్రమ చేపల చెరువులు..

  • మంజీర చుట్టూ వందకుపైగా అక్రమ చేపల చెరువులు

  • సింగూరు బ్యాక్‌వాటర్‌ నుంచి ఆ చెరువుల్లోకి నీరు

  • వ్యవసాయ విద్యుత్‌ను వాడి అక్రమంగా తరలిస్తున్న వైనం

  • చేపలకు ఆహారంగా చికెన్‌ వ్యర్థాలు, కుళ్లిన కోడిగుడ్లు

  • ఆ కాలుష్య జలాల్ని మంజీరలోకే వదిలేస్తున్న పరిస్థితి

  • హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌లకు తాగునీరు ఇదే..

  • ట్రాన్స్‌కో, రెవెన్యూ, సాగు నీటి అధికారుల ప్రేక్షక పాత్ర

  • సంగారెడ్డి జిల్లాలోని 20 గ్రామాల్లో అక్రమ దందా

సంగారెడ్డి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంజీర నదిని ఆనుకుని ఏర్పాటు చేసిన వందకుపైగా చేపల చెరువులు.. ఒక వైపు కాలుష్యాన్ని వెదజల్లుతూ, మరో వైపు సింగూరు ప్రాజెక్టు నీటిని మింగేస్తున్నాయి. ఈ చెరువుల్లో పెంచుతున్న చేపలకు ఆహారంగా చికెన్‌ వ్యర్థాలు, కుళ్లిన కోడిగుడ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉండగా.. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే మంజీర నది పరివాహక ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఏడాది కాలంగా ఈ అక్రమ దందా సాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద, మనూరు, న్యాల్‌కల్‌, రాయికోడ్‌, వట్‌పల్లి మండలాల్లో మంజీర నది పరివాహక ప్రాంతాన్ని కొందరు అక్రమార్కులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ మండలాల్లోని దాదాపు 20కి పైగా గ్రామాల్లో అక్కడి స్థానిక నేతలు, అధికారులను ప్రసన్నం చేసుకుని, 100కు పైగా చెరువులను అక్రమంగా తవ్వారు. ఒక్కో చెరువు విస్తీర్ణం 5 ఎకరాల నుంచి 20 ఎకరాల దాకా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో మంజీర నది ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా సరిహద్దు ముగిసేదాకా.. రెండువైపులా ఈ చేపల చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు గ్రామపంచాయతీల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల పర్మిషన్లు సైతం తీసుకోలేదు. ఎక్కడికక్కడ తాయిలాలు ముట్టచెప్పి.. ఈ చేపల చెరువులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


అక్రమంగా నీటిని తోడివేస్తూ..

30టీఎంసీల సామర్థ్యం కలిగిన సింగూరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని పొదుపుగా వాడుతూ.. హైదరాబాద్‌, ఉమ్మడి మెదక్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు తరలిస్తున్నారు. కానీ, చేపల చెరువులు నిర్మించిన అక్రమార్కులు సింగూరు బ్యాక్‌వాటర్‌ను భారీ మోటార్లతో తోడేస్తున్నారు. ఆయా చెరువులను సింగూరు నీటితో నింపుతున్నారు. ఇందుకు వ్యవసాయ విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారు. రాత్రింబవళ్లు ఈ విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తూ.. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఈ చెరువులను నీటితో నింపుతున్నారు. ఇంత జరుగుతున్నా విద్యుత్‌ అధికారులు కనీసం అటువైపు కూడా చూడడం లేదు. ఇక, చేపలు త్వరగా పెరగడానికి కుళ్లిన గుడ్లు, చికెన్‌ వ్యర్థాలను ఆహారంగా పెడుతున్నారు. హైదరాబాద్‌లో సేకరించిన చికెన్‌ వ్యర్థాలను ట్రాలీ ఆటోల్లో ఇక్కడికి తరలిస్తున్నట్లు తెలిసింది. ఆయా చెరువుల్లో చికెన్‌ వ్యర్థాలు పైకి తేలుతూ కనిపిస్తుండడం.. గగ్గుర్పాటుకు గురి చేస్తోంది. ఇలా కలుషితమైన జలాలను మళ్లీ మంజీర నదిలోకే మళ్లిస్తున్నారు. ఆ నీరు నేరుగా సింగూరులోకి చేరుతోంది. ఆ నీటినే ఏడాదిగా హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు తాగు నీరుగా సరఫరా చేస్తుండడం గమనార్హం. నీటి నాణ్యతపై సంబంధిత అధికారులెవరూ పట్టించుకోకపోవడం, మంజీర నది వైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు. కాగా, ఇక్కడ పెంచే చేపలను ఇతర రాష్ట్రాల్లోని ఫార్మా సంస్థలకు ఎగుమతి చేస్తారని తెలుస్తుండగా.. మార్కెట్లలోనూ విక్రయిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ఆహ్లాదంగా ఉండేదని, ఇప్పుడు నీళ్లన్నీ కలుషితమై దుర్వాసన వస్తోందని స్థానిక గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

అధికారులు గప్‌చుప్‌..

మంజీర పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా చెరువులు తవ్వడం, విషపూరిత కాలుష్య జలాలను నదిలోకే వదిలేయడం, ఏడాదికాలంగా అక్రమ విద్యుత్‌ను వినియోగించడం, కుళ్లిన గుడ్లు, చికెన్‌ వ్యర్థాలతో చేపలను పెంచడం.. ఇదంతా బహిరంగంగానే జరుగుతునా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. పైసా ఖర్చు లేకుండా మంజీర నీళ్లు, భూమి, విద్యుత్‌ వంటివన్నీ ఉచితంగా వాడేస్తుండడం.. చేపల చెరువుల నిర్వాహకులకు భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది. అందుకే తమ దందాకు అడ్డురాకుండా అధికారులు, స్థానిక నేతలకు తాయిలాలు ముట్టచెప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి.

2.jpg

Updated Date - Jun 12 , 2026 | 07:00 AM