అక్రమాల జాతర
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:22 AM
ఇటీవల జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో రూ. 132 కోట్ల విలువ గల ధాన్యం దారి మళ్లించినట్లు తేల్చారు. ప్రధానంగా వేలం వేసిన 2022-23 యాసంగి సీజన్‌కు చెందిన ధాన్యానికి సంబంధించి బకాయిలు చెల్లించని, 2024-25 వానాకాలం, యాసంగి
జగిత్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఒక చిన్న దుకాణం పెట్టాలన్నా పెట్టుబడి, అద్దె, సిబ్బంది, ప్రచారం, మున్సిపల్, లేబర్, జీఎస్‌టీ, వెయిట్ అండ్ మెజర్‌మెంట్స్ లైసెన్స్‌లు, ప్రచారం... ఇలా ఎన్నో ఖర్చులు, పత్రాలు అవసరం... అన్నీ పోను చివరకు మిగిలేది కొద్ది లాభం మాత్రమే. కానీ రైస్ మిల్లు ఉంటే కథ మరోలా ఉంటుంది. ప్రభుత్వమే ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చుతుంది. మిల్లింగ్‌కు గడువు ఇస్తుంది. బియ్యం అప్పగిస్తే మిల్లింగ్ చార్జీలు ఇస్తుంది. నూక, ఉనక (తవుడు) ఇలా ఉప ఉత్పత్తుల ఆదాయం కూడా మిల్లర్లకే.. ఇంతే కాదు..ఈ వ్యవస్థలోని లోపాలను ఆసరా చేసుకొని అధికారులను ప్రసన్నం చేసుకొని కొందరు, యంత్రాంగం కళ్లు గప్పి మరికొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి ఏకంగా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో రూ. 132 కోట్ల విలువ గల ధాన్యం దారి మళ్లించినట్లు తేల్చారు. ప్రధానంగా వేలం వేసిన 2022-23 యాసంగి సీజన్‌కు చెందిన ధాన్యానికి సంబంధించి బకాయిలు చెల్లించని, 2024-25 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ధాన్యం లెక్కల్లో తేడాలను గట్టురట్టు చేస్తున్నారు. సంబంధిత మిల్లులపై కేసులు నమోదు చేయడం, క్రిమినల్ కేసులకు దిగడం, రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో మిల్లర్ల మెడకు ఉచ్చు బిగిస్తున్నారు.
ఫ నిఘా వైఫల్యమే కారణమా?
మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టించడం వెనక నిఘా వైఫల్యమే కారణమనే ప్రచారం జరుగుతోంది. మిల్లుల్లో లెక్క ప్రకారం ధాన్యం నిల్వలు ఉన్నాయా.. లేవా అని మండల, జిల్లా రెవెన్యూ పౌర సరఫరాల సంస్థ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యం కేటాయింపు నుంచే జరుగుతున్న అక్రమాలు, అధికారుల పాత్రపైనా విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు.
ఫ తనిఖీల వేళ.. మిల్లర్లలో వణుకు
మిల్లుల్లో ధాన్యం నిల్వలు లెక్కలు తేల్చే పనిలో సివిల్ సప్లయ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిమగ్నమైంది. ప్రభుత్వం సీఎంఆర్ కొరకు సీజన్ల వారీగా కేటాయించిన ధాన్యం బస్తాలు ఎన్ని ఉన్నాయి. ఆ మిల్లుకు కేటాయించిన ధాన్యానికి సీఎంఆర్ పూర్తి చేసి తిరిగి వచ్చిన బియ్యం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేటుకు విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలు లేకపోవడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. ఇప్పటివరకు టెండర్ ధాన్యం బకాయి జాబితాలో టాప్ టెన్‌లోని నాలుగు మిల్లుల్లో తనిఖీలు జరిగాయని, తదుపరి తనిఖీలు అత్యధిక బకాయిలు గల మిగితా మిల్లుల్లో ఉంటాయనే చర్చ నడుస్తోంది. జిల్లాలోని రంగాపూర్, చెప్యాల్, సిరికొండ, తిమ్మాపూర్, పూడూరు, సాతారం తదితర ప్రాంతాల్లో గల రైస్ మిల్లులు టెండర్ ధాన్యం బకాయి జాబితాలో టాప్‌లో ఉన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి.
ఫ ధాన్యం అమ్మడం.. బియ్యం కొనడం
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కొరకు ఇచ్చిన ధాన్యాన్ని అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు, సివిల్ సప్లయి శాఖకు ఇవ్వాల్సిన బియ్యం ఇతర రాష్ట్రాల నుంచి కొని తీసుకు వస్తున్నారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి రీ సైక్లింగ్‌కు పాల్పడడం వంటివి చేస్తున్నారు. ప్రభుత్వ బియ్యాన్ని అడ్డం పెట్టుకొని రూ. కోట్లలో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. ప్రతి యేటా యాసంగి, వానాకాలం సీజన్‌లకు చెందిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు ఎలాంటి గ్యారెంటీలు లేకుండా అప్పగిస్తుంది. కొందరు మిల్లర్లు రూ. కోట్ల విలువ గల ధాన్యం పక్కదారి పట్టించి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్‌లు, కార్లు కొనుగోలు చేయడం, అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేయడం, ఫంక్షన్లు చేయడం, ఏసీలు, విదేశీ టూర్లు ఇలా విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. వెంటనే బకాయి బియ్యం పెట్టాలని అధికారులు హుకుం జారీ చేస్తే.. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాల నుంచి బియ్యం తెప్పించి అప్పగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు బకాయి బియ్యం పెట్టడం సాధ్యం కాని మిల్లర్లు నేతలతో పైరవీలు చేయించడం, అధికారుల అవసరాలను తీర్చి ప్రసన్నం చేసుకోవడం వంటివి చేస్తూ తప్పించుకుంటున్నారు.
ఇటీవల జిల్లాలో వెలుగులోకి..
ఫ జగిత్యాల రూరల్ మండలంలోని శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ర్టీస్, లక్ష్మీ గణపతి ఇండస్ర్టీస్‌లలో రూ. 87 కోట్ల విలువ గల ధాన్యం నిల్వలు లేవని విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఇందులో సుమారు రూ. 40 కోట్ల విలువ గల టెండర్ ధాన్యం, రూ. 47 కోట్ల విలువ గల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. 6ఏ కేసు నమోదు చేయడంతో పాటు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఫ జిల్లాలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట ఏఆర్‌ఎస్ రైస్ మిల్లులో జరిపిన తనిఖీల్లో సుమారు రూ. 45 కోట్లకు పైగా విలువైన ధాన్యం నిల్వలు లేనట్లుగా విజిలెన్స్ అధికారులు తేల్చారు. 2022-23 యాసంగి సీజన్‌కు చెందిన టెండర్ నిర్వహించిన రూ. 29 కోట్ల విలువ గల 12,149 మెట్రిక్ టన్నుల విలువ గల ధాన్యం, 2024-25 యాసంగి, 2024-25 వానాకాలం, 2025-26 యాసంగి సీజన్‌లకు చెందిన రూ. 15 కోట్లు విలువ గల 6,419 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు లేవని తేల్చారు. అత్యావశ్యక వస్తువుల చట్టం - 1955 ప్రకారం సెక్షన్ 6-ఏ కింద కేసులు నమోదు చేశారు.