Share News

అబార్షన్‌ కిట్ల దందా

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:31 AM

రాష్ట్రంలో అబార్షన్‌ (మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ)) కిట్ల అక్రమ విక్రయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యుల ప్రమేయం, వారు రాసిచ్చిన మందుచీటీ లేకుండానే బహిరంగ మార్కెట్లోనూ..

అబార్షన్‌ కిట్ల దందా

  • షాపులు, ఆన్‌లైన్‌లో అక్రమంగా అధిక ధరలకు విక్రయాలు

  • ఇంటివద్దే గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు

  • నల్లగొండలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల

  • దాడుల్లో వెలుగుచూసిన దందాలు

  • గర్భవిచ్ఛిత్తి కిట్లను సిఫారసు లేకుండా వాడితే ప్రాణాలకే ముప్పు: వైద్యులు

  • ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా విక్రయిస్తే రెండేళ్ల దాకా జైలు: అధికారుల హెచ్చరిక

ఇష్టం లేని గర్భాన్ని పోగొట్టుకోవడానికి కొందరు మహిళలు.. వైద్యులను ఆశ్రయించకుండా, ఆన్‌లైన్‌లోనో, మందుల దుకాణాల్లోనో రహస్యంగా ఈ కిట్లను కొనుగోలు చేసి సొంతంగా వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపుల వాళ్లు ఎలాంటి పరీక్షలూ చేయకుండా ఈ కిట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అలా వైద్యుల సలహా లేకుండా విక్రయిస్తే రెండేళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై నిఘా పెంచి, అక్రమ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అబార్షన్‌ (మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ)) కిట్ల అక్రమ విక్రయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యుల ప్రమేయం, వారు రాసిచ్చిన మందుచీటీ లేకుండానే బహిరంగ మార్కెట్లోనూ, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ అబార్షన్‌ కిట్లు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ హోల్‌ ేసల్‌ మెడికల్‌ ఏజెన్సీపై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు దాడి చేసి.. బిల్లులు లేని ఆ కిట్లను భారీగా సీజ్‌ చేయడంతో ఈ అక్రమ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. నల్లగొండ ప్రకాశం బజార్‌లోని ఓ మెడికల్‌ ఏజెన్సీలో ఎలాంటి కొనుగోలు రసీదులు, రికార్డులు లేకుండా నిల్వ ఉంచిన 113 అబార్షన్‌ కిట్లను డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షెడ్యూల్‌-హెచ్‌ పరిధిలోకి వచ్చే ఈ కిట్లను సరైన వైద్య సలహా లేకుండా విక్రయించడం డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ ప్రకారం తీవ్రమైన నేరం. మామూలు మందుల దుకాణాల్లోనే కాదు.. ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ ఫార్మసీ పోర్టళ్లలోనూ ఇవి సులువుగా దొరుకుతున్నాయి.


ఈ కిట్ల అసలు ధర రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌ సైట్లలో, బ్లాక్‌ మార్కెట్‌లో ప్రిస్ర్కిప్షన్‌ అడగకుండా రూ.1,500 నుండి రూ.3,000కు అమ్ముతున్నారు. అవసరం ఉన్నవారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. వీటి విక్రయాల విషయంలో వయసు నిబంధనలను సైతం గాలికి వదిలేస్తున్నారు. వయసు, శారీరక స్థితితో సంబంధం లేకుండా కేవలం డబ్బు చెల్లిస్తే చాలు, కొరియర్ల ద్వారా నేరుగా ఇంటికే డెలివరీ చేసేస్తున్న పరిస్థితి నెలకొంది.


ప్రాణాలకే ప్రమాదం..

అబార్షన్‌ కిట్లలో మిఫెప్రిస్టోన్‌, మిసోప్రోస్టోల్‌ అనే శక్తివంతమైన హార్మోన్‌ బిళ్లలు ఉంటాయి. వీటిని గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణ లేకుండా సొంతంగా వాడి.. మహిళలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వీటిని వాడినప్పుడు పిండం పూర్తిగా బయటకు రాకుండా కొంత మేర గర్భాశయంలోనే ఉండిపోతే తీవ్ర ఇన్ఫెక్షన్లు వస్తాయి. అధిక రక్తస్రావం జరిగి, క్షణాల్లో బీపీ పడిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. గర్భం గర్భాశయం వెలుపల (అండాశయ నాళాల్లో) ఉంటే, ఈ కిట్లు వాడటం వల్ల ఫెలోపియన్‌ ట్యూబ్‌ పగిలిపోయి అంతర్గత రక్తస్రావంతో క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు శాశ్వత వంధ్యత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరచూ ఈ మాత్రలు వాడటం వల్ల గర్భాశయ పొరలు దెబ్బతిని, భవిష్యత్తులో శాశ్వతంగా గర్భం దాల్చే అవకాశాన్ని కోల్పోతారని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.


పోర్టబుల్‌ యంత్రాలతో లింగనిర్థారణ పరీక్షలు..

అవాంఛిత గర్భాన్ని వదిలించుకునేందుకు కొందరు అడ్డగోలుగా అబార్షన్‌ కిట్లు వినియోగిస్తుండగా.. మరికొందరు పుట్టబోయేది ఆడో, మగో తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందుకోసం పనిజేసే ముఠాలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. పోర్టబుల్‌ యంత్రాల సహయంతో ఇంటివద్దకే వచ్చి మరీ వీరు లింగనిర్థారణ పరీక్షలు చేస్తునాన్నరు. ఒకవేళ ఆడబిడ్డ అని తేలితే పిండదశలోనే ఆయువు తీసేస్తున్నారు. ఇటీవల నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పోర్టబుల్‌ మెషీన్ల ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలసి పట్టుకున్నారు. ఇటువంటి దందానే కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకోగా.. ఆ దందా చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి అలా్ట్రసౌండ్‌ మెషీన్స్‌ను ఎవరికిపడితే వారికి అమ్మడానికి రూల్స్‌ ఒప్పుకోవు. రిజిష్ట్రేషన్‌ లేకుండా సాధ్యం కాదు. అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ పద్దతిలో వీటిని తీసుకువస్తూ దందాను నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే రోగుల్లేని, అంతగా నడవని ఆస్పత్రుల నుంచి వీటిని కొంటున్నట్లు సమాచారం. ల్యాప్‌టాప్‌ సైజులో ఉండే పోర్టబుల్‌ స్కానింగ్‌ యంత్రాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఇటువంటి వ్యవహరాలను నడుపుతున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 06:51 AM