IIT Student Innovates: కలుపు మొక్కలతో కాగితం తయారీ
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:57 AM
వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చని (వేస్ట్ టు వెల్త్) నిరూపించింది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని రేపాక భార్గవి.
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ఐఐటీ విద్యార్థిని వినూత్న ప్రయోగం
చేర్యాల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చని (వేస్ట్ టు వెల్త్) నిరూపించింది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని రేపాక భార్గవి. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్ ఐఐటీలో చదువుతున్న భార్గవి ఇటీవల హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నెల రోజుల పాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసింది. ఈ సందర్భంగా హెచ్‌వోడీ శ్రీనునాయక్, ప్రొఫెసర్ ఎస్. ఐలయ్యల మార్గదర్శకత్వంలో ఆమె ఒక వినూత్న ప్రయోగం చేపట్టింది. చెరువులు, కాలువల్లో విపరీతంగా పెరిగి పర్యావరణానికి ముప్పుగా మారుతున్న కలుపు మొక్కలను ఉపయోగించి కాగితాన్ని తయారుచేసింది. ఈ విధానాన్ని పారిశ్రామిక స్థాయిలో అమలు చేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని భార్గవి వివరించారు. భార్గవి బృందాన్ని యూనివర్సిటీ అధికారులు అభినందించగా స్థానికులు ఆమె ప్రతిభను కొనియాడారు.