ఇంజనీరింగ్ అధ్యాపకులకు శిక్షణ
ABN , Publish Date - May 14 , 2026 | 03:57 AM
ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సీఎ్‌సఆర్ నిధుల సహకారంతో నిర్వహిస్తున్న..
హైదరాబాద్ ఐఐటీహెచ్‌లో ప్రత్యేక మెంటార్‌షిప్ ప్రోగ్రాం
దేశవ్యాప్తంగా సీఎస్, ఐటీ ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ
దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు
కంది, మే 13 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సీఎ్‌సఆర్ నిధుల సహకారంతో నిర్వహిస్తున్న ‘సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్’ (సీఈఈఈ)-2026 కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఈసారి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో నిర్వహించనున్నారు. సీఎస్, ఐటీ విభాగాలకు సంబంధించిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జూన్ 8 నుంచి 28 వరకు ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. ఇంజనీరింగ్ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చడం, అధ్యాపకుల్లో ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన పెంచడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే సామర్థ్యాన్ని ఫ్యాకల్టీలో పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వికసిత్ భారత్-2047 దిశగా నిపుణులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల తయారీలో అధ్యాపకుల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రయాణం, వసతి, భోజన ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.50 వేల వరకు శిక్షణ సహాయం అందించనున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్‌కు రెండు వారాల ఏఐసీటీఈ ఏటీఏఎల్ ఎఫ్‌డీపీతో సమానంగా గుర్తింపు ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఐటీ విభాగాలకు చెందిన కీలక అంశాలపై లోతైన శిక్షణ ఇవ్వనున్నారు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్/కంప్యూటర్ నెట్‌వర్క్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్/ఆర్కిటెక్చర్, డేటాబేస్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో ముఖ్య అంశాలను బోధించనున్నారు. దేశంలోని ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు మే 15 చివరి తేదీగా నిర్ణయించారు. వివరాలకు ఐఐటీహెచ్ టీచింగ్ లెర్నింగ్ సెంటర్ చైర్ ప్రొఫెసర్ భువనేశ్ రామకృష్ణను 040-23016001 నంబరులో సంప్రదించాలని ఐఐటీహెచ్ అధికారులు పేర్కొన్నారు.