పేరు గ్లోబల్.. నీరు లోకల్
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:13 AM
హైదరాబాద్ నగరం గ్లోబల్‌సిటీగా దూసుకుపోతున్నా.. తాగునీటి స్వచ్ఛత, భద్రత విషయంలో మాత్రం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతోంది..
హైదరాబాద్‌లో తాగునీటి స్వచ్ఛతపై భయాలు
ప్రభుత్వం సరఫరా చేసే నీటి నాణ్యతపై అపనమ్మకం
ప్యూరిఫయర్లు, ఫిల్టర్లవైపే ఎక్కువ మంది మొగ్గు
ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలో వెల్లడి
కంది, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరం గ్లోబల్‌సిటీగా దూసుకుపోతున్నా.. తాగునీటి స్వచ్ఛత, భద్రత విషయంలో మాత్రం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతోంది. ప్రభుత్వం సరఫరా చేసే నీటి నాణ్యతపై నమ్మకం లేని నగరవాసుల్లో చాలామంది వ్యక్తిగత వాటర్ ప్యూరిఫయర్లు, ఫిల్టర్లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ప్యూరిఫయర్లు లేదంటే ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే ప్యూరిఫైడ్ నీటిపై అధికంగా ఆధారపడుతున్నారని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో తేలింది. ఐఐటీహెచ్‌లోని ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవల్‌పమెంట్’ విభాగం పరిశోధకులు హరిప్రియ నరసింహన్, కనక హిమబిందు పొట్టుముత్తు కలిసి ‘ఫిల్టరింగ్ ఫర్ ప్యూరిటీ, మిడిల్ క్లాస్ యాటిట్యూడ్స్ టు వాటర్ ఇన్ అర్బన్ ఇండియా’ పేరిట ఈ సర్వే నిర్వహించారు. సర్వే వివరాలను సోమవారం వెల్లడించారు.
నమ్మకమే ప్రధాన సమస్య
ప్రభుత్వం సరఫరా చేసే నీటి నాణ్యతపై హైదరాబాద్‌లోని మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని సర్వేలో తేలింది. నీటి కనెక్షన్ల జారీలో అవినీతి కూడా అందుకు ఒక కారణమని వెల్లడైంది. ఈ అపనమ్మకంతోనే ప్రజలు పైవ్రేటు వాటర్ ప్యూరిఫైయర్లు, వాటర్ క్యాన్ల వైపు మొగ్గుతున్నారని పరిశోధకులు తెలిపారు. ‘నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌కు నీటి కనెక్షన్ సైజు పెంచాలన్నా, కొత్త కనెక్షన్లు రావాలన్నా రూ.వేలకొద్దీ లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. కనెక్షన్లలోనే ఇంత అవినీతి ఉంటే.. జలమండలి శుద్ధి కేంద్రాల్లో నీటిని సరిగ్గా శుద్ధి చేస్తారన్న నమ్మకం ఏంటి?’ అని సర్వేలో పాల్గొన్నవారిలో చాలామంది ప్రశ్నించారు. ఈ అపనమ్మకం నుంచే నగరంలో వాటర్ ప్యూరిఫయర్ల సామ్రాజ్యం విస్తరించింది. సర్కారు నీటి కంటే ఈ ప్యూరిఫయర్ల నీరే సురక్షితమని ప్రజలు నమ్ముతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉంటే నగరంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగినట్లు సర్వేలో తేలింది. చాలా చెరువులు కబ్జాకు గురికావడంతో నీటి లభ్యత దారుణంగా పడిపోయింది. గతంలో 200 అడుగుల లోతులోనే నీరు లభ్యం కాగా, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 900-1,500 అడుగులు లోతుకు వెళ్తేగానీ నీటి జాడ కనపడటం లేదు. ఒక్కో బోరు బావి తవ్వకానికి రూ.లక్షల్లో ఖర్చవుతుండటం మధ్యతరగతికి భారంగా మారిందని సర్వే నివేదిక పేర్కొంది.
సుస్థిర నీటి సంరక్షణ విధానం అత్యవసరం
నగరంలో భవిష్యత్‌లో నీటి సంక్షోభాన్ని తప్పించాలంటే తక్షణం సుస్థిర నీటి సంరక్షణ విధానం అమలుచేయాలని పరిశోధకులు సూచించారు. నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు సాంకేతిక పురోగతి, రోడ్లు, ఫ్లైఓవర్లు ఉంటే సరిపోదని.. పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే స్వచ్ఛమైన నీటి లభ్యత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పర్యావరణ హితమైన నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించేందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. జీహెచ్‌ఎంసీ, జలమండలి వంటి యంత్రాంగాలు అందుకు చర్యలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.