క్యాన్సర్‌కు బంగారు కణాలతో చెక్
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:46 AM
క్యాన్సర్ మహమ్మారి శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలూ తీస్తుంది. క్యాన్సర్‌కు చేసే కెమోథెరపీ వంటి చికిత్సలు ఎంతో బాధాకరం కూడా. దానితో శరీరమంతా దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
గోల్డ్ కోటెడ్ క్యాల్షియం పెరాక్సైడ్‌తో క్యాన్సర్ కణాలు నాశనం
వినూత్న విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు
సీఎ్‌సఐఆర్, ఐఐసీటీ భాగస్వామ్యంతో పరిశోధన
కంది, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ మహమ్మారి శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలూ తీస్తుంది. క్యాన్సర్‌కు చేసే కెమోథెరపీ వంటి చికిత్సలు ఎంతో బాధాకరం కూడా. దానితో శరీరమంతా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కానీ శరీరంలో పెద్దగా సమస్య లేకుండా.. నేరుగా క్యాన్సర్ కణాలను అత్యంత సమర్థవంతంగా నాశనం చేసే చికిత్సా విధానాన్ని హైదరాబాద్ ఐఐటీ, సీఎ్‌సఐఆర్-ఐఐసీటీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చర్మ క్యాన్సర్ (మెలనోమా) చికిత్సలో ఫొటోథర్మల్ థెరపీ (కాంతిని పంపి ఉష్ణాన్ని పుట్టించడం) సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చగలిగారు. ఈ విధానంలో బంగారు పూత పూసిన కాల్షియం పెరాక్సైడ్ నానో కణాలను శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు.. అవి వెళ్లి క్యాన్సర్ కణాలకు అతుక్కుంటాయి. తర్వాత వైద్యులు ఫొటోథర్మల్ థెరపీ చేస్తారు. ప్రత్యేకమైన కాంతిని క్యాన్సర్ సోకిన భాగంపై ప్రసరింపజేస్తారు. గోల్డ్ కోటెడ్ నానో కణాలు ఆ కాంతితో ప్రభావితమై విపరీతంగా ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. అదే సమయంలో కాల్షియం పెరాక్సైడ్ నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆక్సిజన్ విడుదలై.. క్యాన్సర్ కణతిలో ఆక్సిడేషన్ జరుగుతుంది. క్యాన్సర్ కణాలు చాలా వరకు నాశనం అవుతాయి. ఈ విధానంలో చుట్టూ ఉన్న సాధారణ శరీర కణాలకు పెద్దగా నష్టమేమీ జరగదు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు, బాధాకరమైన కెమోథెరపీ వంటివి అవసరం లేకుండానే క్యాన్సర్ నుంచి బయటపడటానికి ఈ వినూత్న చికిత్సా విధానం ఉపయోగపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి తగ్గిన క్యాన్సర్ రోగుల్లో సాధారణంగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా ఇవి నియంత్రిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో క్యాన్సర్ కణితుల పరిమాణం బాగా తగ్గిందని, విస్తరణ ఆగిందని గుర్తించామని వెల్లడించారు. తాము రూపొందించిన విధానం క్యాన్సర్ చికిత్స రంగంలో కీలక మలుపుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధనకు ఐఐటీ హైదరాబాద్ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డా.అరవింద్ కుమార్ నాయకత్వం వహించారు. ‘కమ్యూనికేషన్స్ కెమిస్ట్రీ’ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.