ఐఐటీహెచ్‌లో ‘సామాజిక పరిశోధనల’పై కోర్సు
ABN , Publish Date - May 04 , 2026 | 04:57 AM
సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలు చేసే వారికి, డేటా విశ్లేషణలో నైపుణ్యం పెంపొందించుకోవాలనుకునే వారికి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్...
జూన్ 15 నుంచి ఆన్‌లైన్ వేదికగా శిక్షణ
కంది, మే 3 (ఆంధ్రజ్యోతి): సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలు చేసే వారికి, డేటా విశ్లేషణలో నైపుణ్యం పెంపొందించుకోవాలనుకునే వారికి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ‘సామాజిక శాస్త్రాల్లో ప్రభావ అంచనా’ (ఇంపాక్ట్ ఎవాల్యుయేషన్ ఇన్ సోషల్ సైన్సెస్) అనే అంశంపై జూన్ 15 నుంచి జూలై 10 వరకు (నాలుగు వారాలు) ప్రత్యేకమాస్టర్ క్లాస్ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ తరగతులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయని, ప్రతిరోజూ 3 గంటల పాటు బోధన ఉంటుందని వెల్లడించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రాథమిక గణాంక శాస్త్ర (స్టాటిటిక్స్) పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ కోర్సులో చేరడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ కోర్సు ఫీజు రూ.20 వేలు కాగా, దానికి అదనంగా రూ.3,600 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే జూన్ 1లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.5 వేల రాయితీ లభిస్తుందని ఐఐటీహెచ్ అధికారులు వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 10 చివరి తేదీ అని, ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు..