ఆవిష్కరణలకు వేదిక ‘టెక్ కనెక్ట్’
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:56 AM
జాతీయ సాంకేతిక సమ్మేళనం ‘ఎంఎ్‌సఎంఈ టెక్ కనెక్ట్-2026’కు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్ వేదికగా నిలిచింది. కృత్రిమ మేధ...
ఐఐటీహెచ్‌లో జాతీయ సాంకేతిక సమ్మేళనం
కంది, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జాతీయ సాంకేతిక సమ్మేళనం ‘ఎంఎ్‌సఎంఈ టెక్ కనెక్ట్-2026’కు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్ వేదికగా నిలిచింది. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలకా్ట్రనిక్స్, క్లీన్ ఎనర్జీ, హెల్త్‌టెక్, బయోటెక్, ఏరోస్పేస్, మొబిలిటీ, అగ్రిటెక్, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పర్యావరణం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో ఆవిష్కరణలను ప్రదర్శించారు.

చిరుగాలితో విద్యుత్ ఉత్పత్తి
స్వదేశీ సాంకేతికతతో చిరుగాలి వీస్తే పంకాలు సెకండ్‌కు 2.5 మీటర్ల వేగంతో తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరం ‘విండ్ మిల్’ను హైదరాబాద్‌కు చెందిన తంగిరాల వెంకట్‌కుమార్ బృందం అభివృద్ధి చేసింది. దీన్ని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, సముద్రంలో బోట్లు, టెలికాం టవర్లపై ఉంచితే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. సోలార్ ప్లేట్లు ఎండ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఈ విండ్ మిల్‌తో ఎప్పుడైనా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్ ఏర్పాటుకు దాదాపు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని ఆ బృందం తెలిపింది.

ఆహార వ్యర్థాలతో హైడ్రోజన్
హైదరాబాద్ సీఎ్‌సఐఆర్ సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.వెంకట్ మోహన్ బృందం బయో హైడ్రోజన్ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. రూ.50 లక్షలతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటే 500 కేజీల ఆహార వ్యర్థాలతో 5 వేల లీటర్ల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. హైడ్రోజన్‌తో పాటు బయో డీజిల్, మిథేన్, సీఎన్‌జీ గ్యాస్‌ను ఒకే ప్లాంట్‌లో తయారు చేయొచ్చు. ప్రస్తుతం ఈ ప్లాంట్లు హైదరాబాద్‌లోని నాచారం, మౌలాలి ప్రాంతాల్లో ఉన్నాయని, చిన్న పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఉపయోగించడానికి కూడా అనువుగా ఉంటుందని మోహన్ తెలిపారు.

ఒత్తిడిని తెలిపే ‘మైండ్ పల్స్ బ్యాండ్’
చేతికి ధరిస్తే మనలోని ఒత్తిడి తీవ్రతను అంకెల్లో ఫోన్‌కు పంపే ‘మైండ్ పల్స్ బ్యాండ్’ను నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న సిద్ధార్థ, విష్ణు, మహేష్, రక్షిత, హర్ష తమ ప్రొఫెసర్ డాక్టర్ నీలాద్రితో కలిసి తయారు చేశారు. ఈ బ్యాండ్ ధరించినవారు అధిక ఒత్తిడికి గురైతే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌లో అలారం మోగుతుంది. ఒత్తిడితో విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ఈ బ్యాండ్‌ను రూపొందించామని వారు తెలిపారు.

వ్యర్థాలతో కృత్రిమ ఇసుక
థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిద, స్టీల్, అల్యూమినియం, ఎరువుల ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలతో కృత్రిమ ఇసుకను తయారుచేసే టెక్నాలజీని ఐఐటీ భువనేశ్వర్ పరిశోధనా విద్యార్థి కే శేఖర్ అభివృద్ధి చేశారు. ఆల్కలైన్ యాక్టివేటర్ సొల్యూషన్ ద్వారా కొన్ని ప్రత్యేక రసాయనాలను ఈ వ్యర్థాలకు కలిపి కృత్రిమ ఇసుకతో పాటు, కృత్రిమ కంకర రాళ్లను కూడా తయారుచేశారు. దీనికి చాలా తక్కువ ఖర్చవుతుందని, త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని శేఖర్ తెలిపారు.

పాడైన స్కూటీలు కొత్తగా..
పాత వాహనాల్లో బ్యాటరీ అమర్చి దాన్ని ఎలక్ట్రికల్ స్కూటర్‌గా మార్చే టెక్నాలజీని జేఎన్‌టీయూ కూకట్‌పల్లి విద్యార్థులు కే సాయికుమార్, కే లక్ష్మీ శ్రీనివాస్, జే ప్రభాత్ అభివృద్ధి చేశారు. కావాలంటే పెట్రోల్‌తో కూడా నడుపుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దీనికి దాదాపు రూ.20 వేల నుంచి 30 వేల వరకు ఖర్చవుతుందని విద్యార్థులు తెలిపారు.