Share News

ప్రాచీన ఆలయాలకు శాశ్వత ‘ఆయుష్షు’

ABN , Publish Date - May 19 , 2026 | 04:58 AM

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, శిల్పకళా వైభవానికి నిలయమైన కాశీ(వారణాసి) పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునిక డిజిటల్‌ కవచాన్ని ధరించబోతోంది.

ప్రాచీన ఆలయాలకు శాశ్వత ‘ఆయుష్షు’

  • కాశీ విశ్వేశ్వరుడి సాక్షిగా ఐఐటీహెచ్‌ ‘కంప్యూటర్‌’ విప్లవం

  • చారిత్రక ఆలయాలపై అధ్యయనం

  • జీఐఎస్‌, ఫొటోగ్రామెట్రీతో ప్రతి అంగుళం రికార్డు

  • డిజిటల్‌ టెక్నాలజీతో వారసత్వ కట్టడాల సంరక్షణ

  • ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తల భగీరథ ప్రయత్నం

కంది, మే 18(ఆంధ్రజ్యోతి): భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, శిల్పకళా వైభవానికి నిలయమైన కాశీ(వారణాసి) పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునిక డిజిటల్‌ కవచాన్ని ధరించబోతోంది. కాలగర్భంలో కలిసిపోకుండా, వాతావరణ మార్పుల ధాటికి చెదరకుండా ప్రాచీన కట్టడాలను భవిష్యత్‌ తరాలకు సజీవంగా అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ నడుం బిగించింది. ఐఐటీహెచ్‌ డిజైన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ శివాజీ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌ఆర్‌ఐ ప్రాజెక్టు ద్వారా కాశీలోని 5 చారిత్రక ఆలయాల డిజిటల్‌ పరిరక్షణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయాల నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, వాతావరణ మార్పుల ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీహెచ్‌ పరిశోధకులు వినియోగిస్తున్నారు. హై రిజల్యూషన్‌ త్రీడీ డాక్యుమెంటేషన్‌తో ఆలయాలకు సంబంధించిన ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా రికార్డ్‌ చేయడం, జీఐఎస్‌ ఆధారిత మ్యాపింగ్‌, ఫొటోగ్రామెట్రీ ఆధారంగా భౌగోళిక, నిర్మాణ లెక్కింపులతో కచ్చితమైన నమూనాలు తయారు చేస్తున్నారు. వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌) టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో భక్తులు, పరిశోధకులు ప్రపంచంలో ఎక్కడున్నా.. నిజంగా కాశీ ఆలయంలో నే ఉన్నామనే అనుభూతిని పొందేలా డిజిటల్‌ నమూనాలను సృష్టిస్తున్నారు.

భవిష్యత్‌ తరాల కోసమే : ఐఐటీహెచ్‌ ప్రొ. శివాజీ

డిజిటల్‌ సంరక్షణ ద్వారా ఆలయాల నమూనాలు శాశ్వతంగా భద్రంగా ఉంటాయని ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివాజీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక వైభవం చెక్కుచెదరకుండా రేపటి తరాలకు సురక్షితంగా అందించాలనే మహత్తర లక్ష్యంతోనే అత్యాధునిక డిజిటల్‌ టెక్నాలజీతో కాశీలోని చారిత్రక దేవాలయాలను డిజిటలైజ్‌ చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 04:58 AM