మెట్ట.. తగ్గితే ఎట్టా
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:30 AM
జిల్లాలో మెట్ట పంటల సాగు తగ్గుతోంది. కంది, వేరుశనగ, పెసర, మిర్చి, పత్తి, ఉలువలు, మినుములు, బొబ్బర్లు, జొన్న పంటలకు డిమాండ్ ఉన్నా పండించడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
జిల్లాలో తగ్గిన కంది, వేరుశనగ పంటల సాగు
అంతర్ పంటలుగానే బొబ్బర్లు, ఉలువలు, మినుము
నీటి లభ్యత ఉండడంతో వరి సాగుకే మొగ్గు
భానుపురి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మెట్ట పంటల సాగు తగ్గుతోంది. కంది, వేరుశనగ, పెసర, మిర్చి, పత్తి, ఉలువలు, మినుములు, బొబ్బర్లు, జొన్న పంటలకు డిమాండ్ ఉన్నా పండించడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి అవగాహన కల్పిస్తున్నా సాగు విస్తీర్ణం పెరగ డం లేదు. మార్కెట్ కూడా సక్రమంగా లేకపోవడంతో పం డించడానికి రైతులు ఆసక్తి చూడపడం లేదు. ఇతర జిల్లా ల్లో మెంట పంటలు సాగవుతున్నా ఇక్కడ మాత్రం తగ్గిం ది. ఎర్ర, నల్లరేగడి, ఇసుక నేలలున్నా పంటలకు వాతావర ణం అనుకూలించడం లేదు. నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు వరి సాగుకు ఆలవాటు పడిపోయారు. సాగర్, ఎస్‌ఆర్‌ఎస్పీ, మూసీ నీరు పుష్కలంగా ఉండడంతో వరిసాగుకే మొగ్గు చూపారు. రెవెన్యూ పరిధిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, కంది, వేరుశనగ, పెసర, మిర్చి, పత్తి పంటలు సాగుచేసినా మార్కెట్లు అందుబాటులో లేకపోవడం మరో కారణమని రైతులు చెబుతున్నారు. వరిసాగు అయితే రెండు నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుందని, పంట కోతకు యంత్రాలు సైతం అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
రైతులకు మార్కెట్ కష్టాలు
కంది, వేరుశనగ, పెసర్లు, పత్తి, మినుముల సాగు చేయడానికి జిల్లా రైతులు సుముఖంగా లేరు. ఇతర మార్కెట్లలో వీటికి డిమాండ్ ఉన్నా జిల్లాలో పంటల కొరత కనిపిస్తోంది. దీంతో పప్పు ధాన్యాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి చేసుకోవాల్సి వస్తోంది. పది సంవత్సరాల క్రితం జిల్లాలో ఐదు వేల ఎకరాల వరకు కంది సాగు చేశారు. ఇటీవల పత్తి చేనులో అంతర్‌పంటగా వేయడం వల్ల రైతాంగానికి ప్రభుత్వం ప్రకటించిన ధరలు సైతం అందించే పరిస్థితి లేదు. పత్తిసాగు కిందనే రైతులు పొలాలను చూపించడం, పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకురావాలని లింకులు పెట్టడంతో కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు. మూడు సంవత్సరాల నుంచి సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా పాస్‌పుస్తకాల లింకు లేకపోవడంతో కొనుగోలు చేయడం లేదని పండించిన పంటను సైతం రైతాంగం ప్రైవేట్‌గా విక్రయించే నష్టపోయే పరిస్థితి ఉందని సాగుకు మొగ్గు చూపడం లేదు. ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో క్వింటా కంది రూ.10 వేల చొప్పున ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో కంది సాగు అతి తక్కువగా ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వేరుశనగ సైతం ఎస్‌ఆర్‌ఎ్‌సపీ కాల్వ నీరు వచ్చిన తర్వాత కేవలం 300 నుంచి 500 ఎకరాల వరకు మాత్రమే సాగువుతున్నాయి. ఈ పంటలు కూడా ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, నూతనకల్ మండలాల్లో అక్కడక్కడ పండిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం జిల్లాలో పత్తి పంట 1.60లక్షల ఎకరాల్లో సాగయితే ప్రస్తుతం 70నుంచి 80 వేల ఎకరాలకు తగ్గిపోయింది. బొబ్బర్లు, ఉలువలు, మినుములు అంతరపంటలుగానే ఉన్నాయి. పదుల సంఖ్యలోనే సాగు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిర్చి పంట మేళ్లచెరువు, మోతె, నడిగూడెం ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెసర్లు, మినుములు, కందులు గుజరాత్, మహారాష్ట్ర, సౌత్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇతర దేశాల నుంచి అయిల్‌ను దిగుమతి అవుతోంది.