మహిళల హక్కుల కోసం పోరాటాలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:25 AM
మహిళలు జీవించే హక్కు కోసం, వారి ఆత్మ గౌరవం కోసం భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందర్ రామన్ స్పష్టంచేశారు.
14వ ఐద్వా మహాసభల పిలుపు
కార్పొరేట్ శక్తుల కోసం పర్యావరణ విధ్వంసం
ఐద్వా ఉపాధ్యక్షురాలు సుందర్ రామన్ ధ్వజం
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్ర జ్యోతి): మహిళలు జీవించే హక్కు కోసం, వారి ఆత్మ గౌరవం కోసం భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందర్ రామన్ స్పష్టంచేశారు. మానవ మనుగడకు అవసరమైన గాలి, నీరు కూడా ప్రైవేటుపరం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 1981లో అవిర్భవించిన ఐద్వా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.6 కోట్ల మంది సభ్యత్వంతో మహిళల పక్షాన పోరాడుతోందని గుర్తుచేశారు. ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ శక్తులు దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను తీవ్రతరం చేశాయని, పౌరసత్వాన్ని నిరూపించుకోమంటూ డాక్యుమెంట్ల పేరుతో వారిని వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీహార్‌లో 65 లక్షల మంది ఓట్లు తొలగిస్తే.. అందులో 45 లక్షల ఓట్లు మహిళలవే ఉండ డం ఇందుకు నిదర్శనం అన్నారు. ఆదానీ, అంబానీల కోసం అడవులను నరికేస్తుండటం వల్ల వాతావరణం దెబ్బతింటోందని, ఢిల్లీలో స్వచ్చమైన గాలి కోసం ప్రజలు అల్లాడుతున్న పరిస్థితిని ఉదహరించారు. వాతావరణ మార్పుల ప్రభావం మహిళలపై ఒత్తిడిని పెంచుతోందని వివరించారు. మహిళా హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని సుధా సుందర్ రామన్ స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ మహిళల పోరాటాలకు ఐద్వా అండ: ఫుణ్యవతి
ఎస్సీ, ఎస్టీ మహిళల బతుకు దెరువు కోసం చేస్తున్న పోరాటాలకు ఐద్వా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె లో ఐద్వా పాల్గొంటుందని ఆమె ప్రకటించారు. ఆర్‌బీఐ నుంచి పావలా వడ్డీకే రుణాలు పొందుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు.. మహిళలకు మాత్రం రూ.10 వడ్డీతో అప్పులిస్తూ వారిని పీడిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. అభయ హస్తం పథకంలో భాగంగా మహిళలు పొదుపు చేసిన రూ.600కోట్లను వెంటనే వారికి తిరిగి చెల్లించాలని డిమాం డ్ చేశారు. నరేగా పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తొమ్మిది తీర్మానాలతో భవిష్యత్ కార్యాచరణ
14వ మహాసభల మూడోరోజున 9 తీర్మానాలకు ఐద్వా ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యను కాషాయీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, మహిళా వ్యతిరేక కార్మిక చట్టాలకు నిరసన తెలుపుతూ తీర్మానాలు ఆమోదించింది. మహిళలకు రుణ హక్కు కల్పించాలంటూ ఓ తీర్మానం, మహిళా సంక్షేమంలో కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ విజయాలను ఆదర్శంగా తీసుకోవాలంటూ మరో తీర్మానానికి అంగీకారం తెలిపింది. ఆదివాసీ హక్కులపై పోరాటం, దళిత మహిళలకు సమానత్వం, పాఠశాలల పరిరక్షణకు, ఆరోగ్య సేవల ప్రైవేటీకరణను అడ్డుకోవడం వంటి తీర్మానాలకు ఆమోద ముద్ర వేసినట్లు ఐద్వా వెల్లడించింది.