Share News

‘మెట్రో’పై ఐడీబీఐ నివేదిక సిద్ధం!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:44 AM

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌)ను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకునే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌ 1 నాటికి మెట్రో బాధ్యతలను పూర్తిగా తీసుకుని నేరుగా నడిపించేందుకు......

‘మెట్రో’పై ఐడీబీఐ నివేదిక సిద్ధం!

  • ఎల్‌అండ్‌టీ ఆర్థిక లావాదేవీలు,ఆదాయ వనరులపై అధ్యయనం పూర్తి

  • త్వరలో ప్రభుత్వానికి అందనున్న నివేదిక

  • రుణాల సేకరణకు ఇబ్బంది లేని పరిస్థితి

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌)ను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకునే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌ 1 నాటికి మెట్రో బాధ్యతలను పూర్తిగా తీసుకుని నేరుగా నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో మొదటి దశ ప్రాజెక్టు కింద ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన 260 ఎకరాల భూములు, మాల్స్‌, ఇతర ఆస్తులు, ఆదాయ వనరులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా నియమించిన ఐడీబీఐ కన్సల్టెన్సీ పరిశీలన పూర్తి చేసినట్టు తెలిసింది. త్వరలోనే సమగ్ర నివేదికను హెచ్‌ఎంఆర్‌కు అందజేసి, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపించనున్నట్టు సమాచారం.

‘ఐఆర్‌ఎ్‌ఫసీ’కి ఆస్తుల తాకట్టు!

మెట్రోకు సంబంధించి ఎల్‌అండ్‌టీకి ఉన్న రూ.13 వేల కోట్లు అప్పులు, సంస్థకు చెందిన ఈక్విటీ వాటా రూ.2 వేల కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ చెల్లింపుల కోసం ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన భూములు, ఆస్తులను ‘ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎ్‌ఫఆర్‌సీ)’ వద్ద తాకట్టు రుణం తీసుకోనున్నట్టు సమాచారం. ఐడీబీఐ ఇచ్చే నివేదిక ఆధారంగా రుణ సేకరణపై ముందుకు వెళ్లనున్నట్టు మెట్రోరైల్‌ కీలక అధికారి ఒకరు తెలిపారు. రుణం కోసం ఐఎ్‌ఫఆర్‌సీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు చేపట్టిందని, మెట్రోకు మూడు కారిడార్లలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నందున రుణం సులువుగానే వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రో ఆస్తుల విలువ రూ.22 వేల కోట్లకుపైగా ఉన్నట్టుగా ఐడీబీఐ మదింపులో అంచనా వేసినట్టు తెలిసింది. కాగా, మెట్రో పిల్లర్లు, ఇతర ఆస్తులపై ప్రకటనలకు సంబంధించి జీహెచ్‌ఎంసీకి రూ.100 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్టు సమాచారం. ఎల్‌అండ్‌టీకి చెల్లించే సొమ్ములో వీటిని కట్‌ చేస్తారా, లేక మినహాయింపు ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - Feb 27 , 2026 | 04:44 AM