ఐరన్-ఫోలిక్‌యాసిడ్ చికిత్సతో పిల్లల్లో రక్తహీనత అదుపు!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:13 AM
ఆడుతూ, పాడుతూ హాయిగా సాగాల్సిన బాల్యానికి ఒక పెద్ద ప్రతిబందకం రక్తహీనత. అందులోనూ ఐరన్‌లోపంతో తలెత్తే రక్తహీనతతో ....
ముందస్తు పరీక్ష, సకాలంలో ఐరన్, ఫోలిక్‌యాసిడ్ సప్లిమెంట్‌తో 80ు వరకు రక్తహీనత కంట్రోల్
ఐరన్‌లోపంతో తలెత్తే రక్తహీనత 100 శాతం తగ్గుదల
3 నుంచి ఐదేళ్లలోపు పిల్లలపై ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ అధ్యయనం
హైదరాబాద్ సిటీ, జూన్22 (ఆంధ్రజ్యోతి): ఆడుతూ, పాడుతూ హాయిగా సాగాల్సిన బాల్యానికి ఒక పెద్ద ప్రతిబందకం రక్తహీనత. అందులోనూ ఐరన్‌లోపంతో తలెత్తే రక్తహీనతతో బాధపడుతున్నవారే అధికం. తద్వారా వచ్చే శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు, రోగనిరోధక శక్తి సన్నగిల్లడం, జలుబు, దగ్గు, జ్వరంవంటి ఇన్‌ఫెక్షన్లు, ఏకాగ్రత లోపం, గ్రహణశక్తి తగ్గడం, బలహీనత, అలసట వంటి ఆరోగ్యసమస్యలు పిల్లలను వేధిస్తుంటాయి. అవన్నీ అందమైన బాల్యానికి అడుగడుగునా అవరోధాలుగా మారతాయి. అదే పిల్లలకు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, సకాలంలో ఐరన్-ఫోలిక్‌యాసిడ్ చికిత్స అందించడం ద్వారా 80శాతం వరకు రక్తహీనత సమస్యను నియంత్రించవచ్చునని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధనామండలి) -ఎన్‌ఐఎన్ (జాతీయ పోషకాహార సంస్థ) అధ్యయనంలో తేలింది.
హైదరాబాద్‌లోని తుకారాంగేట్, అడిక్‌మెట్, సీతాఫల్‌మండి పరిసర బస్తీల్లోని అంగన్‌వాడీ, ప్రీప్రైమరీ స్కూళ్లలోని 3-5 ఏళ్లలోపు చిన్నారులు 825 మందికి రక్తహీనత, ఐరన్ పరీక్షలు నిర్వహించారు. అందులో స్వల్ప, మధ్యస్థ స్థాయి రక్తహీనతతో బాధపడుతున్న 248మందిపై ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు టీనా దేశాయ్, రవీంద్రనాథ్ పలికా అధ్యయనం నిర్వహించారు. ముందుగా 124 మంది చొప్పున చిన్నారులను రెండు గ్రూపులుగా విభజించారు. ఓ సమూహానికి ఐరన్-ఫోలిక్‌యాసిడ్ సిరప్ పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్ పొడి, మరొక సమూహానికి ఐరన్-ఫోలిక్ యాసిడ్ సిర్‌ప తో పాడు ప్లేసిబో(ప్రభావంలేని ఔషథం) 90రోజుల పాటు క్రమం తప్పకుండా ఇచ్చా రు. తర్వాత పరీక్షించగా ఆచిన్నారుల్లో హిమోగ్లోబిన్ స్థాయి సగటున 2గ్రాములు పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రోబయోటిక్స్ ప్రయోజనాలు శూన్యం
ఐరన్-ఫోలిక్‌యాసిడ్ చికిత్స అనంతరం ఐరన్ లోపంవల్ల తలెత్తే రక్తహీనత 100శాతం నయమైనట్లు ఎన్‌ఐఎన్ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అంతేకాదు, ఐరన్ లోపం 98 శాతం, రక్తహీనత పెరుగుదల 77శాతానికి తగ్గినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక జీర్ణవ్యవస్థకు మేలుకలిగించే ప్రోబయోటిక్స్ సప్లిమెంట్లు వాడని పిల్లలతో పోలిస్తే అవి తీసుకున్నవారిలోనూ ప్రత్యేక మార్పులేమీ కనిపించలేదని ఈ అధ్యయనం నిరూపించింది. ప్రోబయోటిక్స్ సురక్షితమైనా ఆ సప్లిమెంట్లను ఐరన్-ఫోలిక్‌యాసిడ్ చికిత్సలో ఇవ్వడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలేమీ లేవని పరిశోధనాపూర్వకంగా నిరూపితమైనట్లు శాస్త్రవేత్త రవీంద్రనాథ్ చెప్పారు. కనుక ప్రోబయోటిక్స్ అందించాల్సిన అవసరం లేదని వివరించారు. పిల్లలకు రక్తహీనత, ఐరన్ పరీక్షలు నిర్వహించి సకాలంలో ఐరన్-ఫోలిక్‌యాసిడ్ చికిత్స అందించడం ద్వారా 80శాతం రక్తహీనతను నియంత్రించవచ్చునని ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ పరిశోధన నిరూపించింది. ఈ అధ్యయనం యూరోపియన్ జర్నల్‌ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైందని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ భారతీ కులకర్ణి తెలిపారు. రక్తహీనత రహిత భారత్ మార్గదర్శకాల ప్రకారం చిన్నారులకు పరీక్షలు నిర్వహించి, సరైన సమయంలో ఐరన్-ఫోలిక్‌యాసిడ్ సిరప్ ఇవ్వడంద్వారా ఐరన్ లోపాన్ని, రక్తహీనతను తగ్గించవచ్చని ఈ పరిశోధన నిరూపించిందని టీనా దేశాయ్ వెల్లడించారు. పాఠశాల సెలవురోజుల్లోనూ ఎంపికచేసిన పిల్లలకు 3 నెలల పాటు రోజూ ఐరన్-ఫోలిక్‌యాసిడ్ చికిత్స అందించినట్లు చెప్పారు. చిన్నారుల్లోని రక్తహీనతను నివారించడంలో మన దేశం అనుసరిస్తున్న స్ర్కీన్ అండ్ ట్రీట్ విధానానికి అధ్యయనం మరింత బలాన్నిచేకూర్చిందని పరిశోధకులు హర్షం వ్యక్తం చేసింది.