ఐ బొమ్మ రవి ఖాతాలు అన్‌ఫ్రీజ్ చేయండి
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:38 AM
ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కాస్త ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను అతను తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది.
పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు
అయితే ఖాతాల్లోని రూ.3 కోట్ల నగదుపై ఫ్రీజ్ కొనసాగింపు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కాస్త ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను అతను తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. కాగా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని నిందితుడు 8 రోజుల క్రితం కోర్టులో పిటిషన్ వేశాడు. తన ఖాతాల్లో ఫ్రీజ్ అయిన రూ.3 కోట్లను తాను ఉపయోగించుకునేందుకు వీలుగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రవి అందులో కోరాడు. కోర్టు అందుకు నిరాకరిస్తూ బ్యాంకు అకౌంట్లపై మాత్రమే ఫ్రీజ్ తొలగించింది. కాగా పైరసీకి పాల్పడుతూ సినిమా పరిశ్రమకు రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగించడమే కాకుండా... బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసి రూ.కోట్లు సంపాదించాడన్న ఆరోపణలపై ఐ బొమ్మ రవిని హైదరాబాద్ సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు కిందటేడాది నవంబరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనికి కండిషనల్ బెయిల్ లభించింది.