Share News

ఐ బొమ్మతో లింక్‌.. 120 మిర్రర్‌ సైట్లు!

ABN , Publish Date - May 18 , 2026 | 02:55 AM

ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐ బొమ్మతో లింక్‌ అయిన దాదాపు 120 మిర్రర్‌ సైట్లు టాలీవుడ్‌ పరిశ్రమకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఐ బొమ్మతో లింక్‌.. 120 మిర్రర్‌ సైట్లు!

  • ఒకటి బ్లాక్‌ చేస్తే మరో సైట్‌ ప్రత్యక్షం

  • తనకు సంబంధం లేదంటున్న ఇమ్మడి రవి

  • రంగంలోకి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో

  • వీటి వెనుక బెట్టింగ్‌ ముఠాల పాత్ర

  • అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐ బొమ్మతో లింక్‌ అయిన దాదాపు 120 మిర్రర్‌ సైట్లు టాలీవుడ్‌ పరిశ్రమకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠాలు విదేశాల నుంచి వీటిని యాక్టివ్‌ చేసినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఐ బొమ్మ మళ్లీ ప్రత్యక్షం కావడం వెనుక తన పాత్ర ఏమీలేదని రవి.. దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల హెచ్చరికతో గతంలోనే తాను వాటిని నిలిపి వేశానని ఆయన వివరించినట్లు సమాచారం. దీంతో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠాలకు చెందిన విదేశీ నిర్వాహకులు కరేబియన్‌, నెదర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ నుంచి ఆఫ్‌షోర్‌ సర్వర్ల ద్వారా ఐ బొమ్మ, బప్పం టీవీని మళ్లీ యాక్టివ్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే రవి ఆధ్వర్యంలో అనేక మిర్రర్‌ సైట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు 120 మిర్రర్‌ సైట్స్‌ కొత్త ఐ బొమ్మ వెబ్‌సైట్‌తో లింక్‌ అయినట్లు సమాచారం. ఒక దాన్ని బ్లాక్‌ చేస్తే వెంటనే మరో మిర్రర్‌ సైట్‌లో ప్రత్యక్షమవుతోందని దర్యాప్తు అధికారులంటున్నారు. కొత్తగా విడుదలైన తెలుగు సినిమాలు ఈ సైట్‌లో ప్రత్యక్షం కావడంతో ఇమ్మడి రవి పేరును వాడుకుంటూ విదేశాల నుంచి ఆన్‌లైన్‌ బె ట్టింగ్‌ ముఠాలు వీటిని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ సర్వర్లు, మిర్రర్‌ డొమైన్లు, వీపీఎన్‌ సర్వీసెస్‌, టెలిగ్రామ్‌ చానల్‌ ద్వారా వారు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఐ బొమ్మ మళ్లీ ప్రత్యక్షం కావడం, తెలుగు సినిమాలు ఇందులో కన్పిస్తుండటంతో సినీ పెద్దల ఆందోళన నడుమ యాంటీ పైరసీ సెల్‌ ఇప్పటికే సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేసింది. అయితే దీనికంటే ముందే మీడియాలో వచ్చిన వార్తా కథనాలతో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్వతంత్రంగా దర్యాప్తు ప్రారంభించి వీటిని బ్లాక్‌ చేయడానికి యత్నించారు. అయితే మిర్రర్‌ డొమైన్‌లను ఉపయోగించుకుని మళ్లీ మళ్లీ అవి కన్పిస్తుండటంతో ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని వారు తీసుకుని వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇమ్మడి రవి ఇందులో తన పాత్రేమీ లేదని చెప్పడంతో పోలీసులు వీటి వెనుక ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.

Updated Date - May 18 , 2026 | 02:55 AM