ఐఏఎస్ రాహుల్‌రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:48 AM
కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది.
అప్పీలుకు వీలుగా అమలు నిలుపుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్ గ్రామంలో ఓ భూవివాదానికి సంబంధించి తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఈ శిక్ష వేసింది. అప్పీల్ చేసుకోవడానికి వీలుగా జైలు శిక్ష అమలును నాలుగువారాలపాటు నిలిపేస్తున్నట్లు పేర్కొంది. నాగవెళ్లి లక్ష్మి అనే మహిళకు సంబంధించిన భూవివాదంలో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసి, మరోసారి విచారణ జరపాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో లక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు భావించిన ధర్మాసనం.. జైలుశిక్ష, జరిమానా విధించింది. అయితే, ఈ విషయమై కలెక్టర్ కార్యాలయ వర్గాలు స్పందిస్తూ.. భూ తగాదా విషయమై కొంత కాలంగా లక్ష్మి విచారణకు హాజరు కావడం లేదని తెలిపాయి. ఈ మేరకు ఆమెకు నోటీసులు సైతం పంపామని పేర్కొన్నాయి.