Share News

కమీషన్ల తిమింగలం

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:54 AM

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన ఒక శాఖలో ఓ ఐఎఎస్‌ అధికారి తీరు ఇప్పు డు తీవ్ర చర్చనీయాంశమైంది. కమీషన్‌ ఇస్తేగానీ ఆయన కలం కదలడం లేదు.

కమీషన్ల తిమింగలం

  • అందినకాడికి దండుకుంటున్న ఐఏఎస్‌ అధికారి!

  • బిల్లు పాస్‌ అవ్వాలంటే చేయి తడపాల్సిందే

  • సంబంధిత మంత్రి ఆగ్రహం.. సీఎంకు ఫిర్యాదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన ఒక శాఖలో ఓ ఐఎఎస్‌ అధికారి తీరు ఇప్పు డు తీవ్ర చర్చనీయాంశమైంది. కమీషన్‌ ఇస్తేగానీ ఆయన కలం కదలడం లేదు. ఏటా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఈ విభాగంలో, సదరు అధికారి వసూళ్ల పర్వం పరాకాష్టకు చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో ఆ శాఖలో నిలిచిపోయిన సుమారు రూ.2 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను కాంగ్రె స్‌ సర్కారు దశలవారీగా విడుదల చేస్తోంది. నెలకు సుమారు రూ. 100 కోట్ల వరకు నిధులు మంజూరవుతుండడాన్ని సదరు అధికారి అవకాశంగా మలుచుకున్నారు. ప్రతి బిల్లుకు ఇంతేసి చొప్పున కమీషన్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. వసూళ్ల కోసం తన కార్యాలయంలోనే ఒకరిని ప్రత్యేకంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ కమీషన్‌ ఏజెంట్‌పై ఫిర్యాదులు రావడంతో, అతడి స్థానంలో మరొకరిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక బిల్లులు చెల్లింపు విధానంలోనూ ఆ అధికారి తెలివిని ప్రదర్శిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వరుస క్రమంలో బిల్లులు చెల్లించాలన్న శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఎక్కువ మొత్తం ఉన్న బిల్లులను ఎంపిక చేసుకుని, భారీగా క మీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఆ బిల్లుల కాంట్రాక్టర్లతో అత్యధిక కమీషన్‌ మాట్లాడుకుని మిగతావి పక్కనపెడతారు. బిల్లులు రాని మిగతా ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిసరాల్లోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆ అధికారి, తన ఇంటినే వసూళ్ల అడ్డాగా మార్చుకున్నట్లు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫీసులో బిల్లులపై సంతకం కాగానే, సంబంధిత కాంట్రాక్టర్లు నేరుగా ఆయన నివాసానికి వెళ్లి మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. గడచిన ఏడెనిమిది నెలల్లోనే ఈ అధికారి కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో వెనకేసుకు న్నట్లు ఆ శాఖ సిబ్బం ది చర్చించుకుంటున్నారు. సదరు అధికారి తీరుపై విసిగిపోయిన బాధితులు పెద్ద ఎత్తును సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి హెచ్చరించినా అధికారి తీరులో మార్పు రాకపోవడంతో, విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సదరు అధికారి వల్ల తమ శాఖ భ్రష్ఠుపట్టిపోతోందని, తక్షణమే ఆయన్ని బదిలీ చేయాలని మంత్రి సీఎంను కోరినట్లు సమాచారం.

Updated Date - Feb 09 , 2026 | 02:54 AM