Share News

ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తా

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:33 PM

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా చూస్తానని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు.

ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తా
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోదండరాం

-ఎమ్మెల్సీ కోదండరాం

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా చూస్తానని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఇన్‌ ఫంక్షన్‌హాలులో నాటి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో జేఏసీగా ఏర్పడి ఎన్నో ఆటుపోట్ల మధ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమం కోసం ప్రభుత్వంతో చర్చించి కృషి చేస్తామన్నారు. ఆర్ధిక, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అందరికి న్యాయం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ ఆశయాల సాధన కోసం అవసరం అయితే మళ్లీ పోరాటం చేస్తామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్ల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అంతిమంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు ఉపాధి కల్పన ఉన్నత విద్య , నాణ్యమైన వైద్య సేవలు , గృహ సౌకర్యాలు , పెన్షన్‌, ఆర్ధిక భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు. విద్యార్ధి, సామాజిక ఉద్యమకారులు, సాహితి మేధావుల సూచనలు, సలహాలను సమగ్రంగా పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు , కార్పోరేటర్‌ ముకేష్‌గౌడ్‌, బాపన్న, నాయకులు శ్రీనివాస్‌, లాల్‌కుమార్‌, మంగ, గురిజాల రవీందర్‌, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:33 PM