ఎర్రచందనం స్మగ్లింగ్ వీడి..హైడ్రోపోనిక్ గంజాయికి
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:45 AM
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ ఈగల్ బృందం మరో ఘన విజయం సాధించింది. రెండు నెలల సుదీర్ఘ ఆపరేషన్‌తో థాయ్‌లాండ్ కేంద్రంగా సాగుతున్న.....
పాత అనుభవంతో ముంబై సోదరుల కొత్త దందా.. థాయ్‌లాండ్ టూ ముంబై వయా హైదరాబాద్!
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ‘ఈగల్’ చెక్
థాయ్‌లో పార్టీలతోకస్టమర్లకు ముఠా ఎర
21వేల జీతంతో యువతకు వల
వారితో హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్
ట్రిప్పుకు రూ.10- 12 కోట్ల గంజాయి!
కోకాపేటలో జల్సా క్లబ్ ఏర్పాటుకు యత్నం
ఈగల్ టీం రెండు నెలల సుదీర్ఘ ఆపరేషన్
హైదరాబాద్, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ ఈగల్ బృందం మరో ఘన విజయం సాధించింది. రెండు నెలల సుదీర్ఘ ఆపరేషన్‌తో థాయ్‌లాండ్ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా గుట్టును ఛేదించి పలువుర్ని అరెస్టు చేసింది. ఆ ముఠాతో చేతులు కలిపిన ముంబై మాఫియా మూలాలను కదిపింది. దేశంలోని నిరుద్యోగ యువతను నెలకు రూ.21 వేల జీతంతో నియమించుకుని వారితో థాయ్‌లాండ్ నుంచి ప్రతి ట్రిప్పుకు కనీసం రూ.10 నుంచి రూ.12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయిని తెప్పిస్తున్న విషయాన్ని బట్టబయలు చేసింది. గతంలో అరబ్ దేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ముంబై మాఫియా ముఠా 2023 నుంచి రూటు మార్చి హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్‌లోకి దిగినట్లు గుర్తించి వివిధ రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య గురువారం ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
థాయ్ పార్టీల్లో కస్టమర్లను గుర్తించి..
గంజాయి మొక్కల్లో లభించే ముఖ్య రసాయన పదార్థమైన టీహెచ్‌సీ (టెట్రా హైడ్రో కానబినాల్). ఇది థాయ్‌లాండ్‌లో పండించే హైడ్రోపోనిక్ గంజాయిలో 25 నుంచి 30 శాతం ఉంటుంది. మన దేశీయ గంజాయి మొక్కల్లో ఉండేది 3 నుంచి 5 శాతమే. ఎక్కువ మత్తు ఇచ్చే హైడ్రోపోనిక్ గంజాయి వినియోగానికి చాలామంది ఉన్నతవర్గాల వారు అలవాటుపడుతున్నారు. దీనినే అవకాశంగా మార్చుకున్న ముంబై మాఫియా ముఠా థాయ్‌లాండ్‌లోని కొన్ని క్లబ్‌ల్లో పార్టీలు నిర్వహించి అక్కడకొచ్చే భారతీయ వినియోగదారులను గుర్తిస్తోంది. థాయ్‌లోని పట్టాయాలో జల్వ క్లబ్‌ను లీజుకు తీసుకుని ఏర్పాటుచేసిన పార్టీలకు బాలీవుడ్ సెలబ్రిటీలూ హాజరయ్యేవారు. ఇలా కస్టమర్లను గుర్తించి థాయ్‌లాండ్ నుంచి భారత్‌లోని వారి ఇంటికే హైడ్రోపోనిక్ గంజాయి పంపిస్తామంటూ ఈ ముఠా డ్రగ్స్ సరఫరాదారులు, పెడ్లర్లతో భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసింది.
నిరుద్యోగ యువతే ‘ట్రాన్స్‌పోర్టర్లు’
ఈ ముఠా ‘ట్రాన్స్‌పోర్టర్ల’తో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన సోదా మెహ్సిన్ బహదూర్ భాయ్ అనే వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా లగేజీలో ఉన్న 13.2 కిలోల గంజాయి బయటపడింది. అతనితో పాటు వచ్చిన హర్షద్ భాయ్ ప్రజాపతి గంజాయితో తప్పించుకున్నట్లు గుర్తించి ఈగల్ బృందానికి సమాచారం ఇచ్చారు. ఈ చిన్న టిప్ ఆధారంగా ప్రారంభమైన ఈగల్ అన్వేషణ డ్రగ్స్ రాకెట్‌ను గుట్టును ఛేదించింది. ఈగల్ టీం హర్షద్‌తో పాటు సందీప్ వాస్వాని అలియాస్ రాహుల్ జైన్‌ను అరెస్టు చేసి 12.739 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. తర్వాత ‘ట్రాన్స్‌పోర్టర్ల’ను సమకూరుస్తున్న ముంద్రా పోర్టు (గుజరాత్) వెల్లుల్లి క్లియరింగ్ ఏజంట్ దల్ అబ్దుల్‌ను అరెస్టు చేసింది. ఈ ముఠా ఇప్పటివరకు 300 మంది ట్రాన్స్‌పోర్టర్లతో వందల కిలోల గంజాయిని థాయ్‌లాండ్ నుంచి ముంబైకి తరలించిందని శాండిల్య తెలిపారు. ట్రాన్స్‌పోర్టర్లుగా పనిచేసిన 40 మందిని గుర్తించగా.. వారిలో 14 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారని తేలింది. 29 మందిని అరెస్టు చేయగా మిగతా 11 మంది పరారీలో ఉన్నారు.
60 కోట్లు పెనాల్టీ కట్టారు
డ్రగ్స్ కార్టెల్ ప్రధాన సూత్రధారిని ముంబైకి చెందిన హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్‌గా ఈగల్ టీం గుర్తించింది. అతను తన తండ్రి ప్రమోద్, సోదరుడు సుధాంశుతో థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో క్లబ్ వ్యాపారం ప్రారంభించి డ్రగ్స్ దందాలోకి వచ్చాడు. ఈ కుటుంబానికి చెందిన వారు గతంలో రూ.500 కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్టైన విషయం ఈగల్ విచారణలో వెల్లడైంది. అప్పట్లోనే వారు కస్టమ్స్‌కు పెనాల్టీ రూపంలో రూ.60 కోట్లు చెల్లించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనుభవాన్ని డ్రగ్స్‌కు మళ్లించిన హేమాంగ్ సోదరులు మూడేళ్ల నుంచి హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ప్రారంభించారు.
ముఠాలో విదేశీయులు, షార్ప్ షూటర్లు
ఈ ముఠాలోని సూరజ్‌పాల్, రోషన్ అలీ, జావీద్ ఖాన్, గులాబ్ చంద్ రాజ్‌భర్, ప్రవీణ్, చాంద్ షేక్, సందీప్ వాస్వాని, రోహన్ ఫెలిక్స్‌లు భారత్‌కు చేరిన గంజాయిని ముంబై తరలించేవారు. ఈ ముఠాలో మరో కీలకమైన వ్యక్తి ముంబైలో కస్టమ్స్ నోటిఫైడ్ షాప్ నిర్వహిస్తున్న మొహమ్మద్ ముస్తఫా ఇస్మాయిల్. ఇతను ప్రవీణ్ నుంచి నగదు తీసుకుని థాయ్‌లాండ్‌లోని బినామీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సుధాంశుకు అందజేసేవాడు. ఈ డబ్బునే వీరు గంజాయి సాగు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా వాడారు. ఈ ముఠాలో క్రిన్ వూ (కొరియా), స్టీవ్, ఎరిక్ (అమెరికా), జేమ్స్, జేన్నీ (బ్రిటన్) భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కలిసి ఒరియంటల్ ప్లాంటేషన్ కంపెనీని ప్రారంభించి వందల కిలోల గంజాయి పండించి దేశానికి తరలిస్తున్నారని, వీరిని పట్టుకోవడం కోసం ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనున్నామని శాండిల్య వివరించారు. హేమాంగ్ గ్యాంగ్‌లో ముంబై మాఫియాలో పనిచేసిన షార్ప్ షూటర్లు ఫెలిక్స్ లాంటి వారున్నారు. ఈ ముఠాలోని ముఖ్యులు ఇంకా చాలామందిని అరెస్టు చేయాల్సి ఉందని, వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఆపరేషన్ కొనసాగిస్తామని శాండిల్య చెప్పారు.
కోకాపేటలో జల్సా క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నం
హేమాంగ్ తన ముఖ్య అనుచరులతో కలిసి ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. కోకాపేటలో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లతో పట్టాయాలోని క్లబ్ తరహాలో జల్సా క్లబ్ ఏర్పాటుకు పలు ప్రదేశాలను పరిశీలించాడు. ‘హిమాంగ్, అతని ప్రధాన అనుచరులు హైఎండ్ కార్లు వాడుతుంటారు. ఎక్కడా ఆన్‌లైన్ పేమెంట్ చేయకుండా జాగ్రత్తపడతారు. థాయ్ కరెన్సీని నగదు ఇచ్చే తీసుకుంటారు. కారు పెట్రోల్‌కు కూడా నగదే ఇస్తారు. హైదరాబాద్‌కు చెందిన అక్బర్ ట్రావెల్స్ నుంచి కొన్ని వందలసార్లు నగదు ఇచ్చి బ్యాంకాక్ టికెట్లు బుక్ చేశారని గుర్తించామ’ని శాండిల్య వివరించారు. దేశంలోని విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు వాడే స్కానర్లకు హైడ్రోపోనిక్ గంజాయిని పక్కాగా గుర్తించడంలో పరిమితులు ఉన్నాయని, ఇదే అదనుగా హేమాంగ్ గ్యాంగ్ యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తోందన్నారు. ఇప్పటివరకు ఈ గంజాయిని ఎక్కువగా హ్యుమన్ ఇంటెలిజెన్స్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం ద్వారానే పట్టుకున్నారని చెప్పారు.