చెర వీడిన.. రూ.30 వేల కోట్ల భూమి
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:21 AM
కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. తప్పుడు పత్రాలు, సర్వే నెంబర్లతో చెరబట్టే ప్రయత్నాన్ని అడ్డుకొని..
కబ్జాల నుంచి 840 ఎకరాలను కాపాడిన హైడ్రా
బహదూర్‌గూడలో 650, రాయదుర్గంలో 84 ఎకరాలు
కంటోన్మెంట్‌లో 106 ఎకరాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. తప్పుడు పత్రాలు, సర్వే నెంబర్లతో చెరబట్టే ప్రయత్నాన్ని అడ్డుకొని రూ.30 వేల కోట్ల విలువైన 840 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడి కంచె వేసింది. రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో 650 ఎకరాలు, రాయదుర్గంలో 84 ఎకరాలు, హైదరాబాద్ జిల్లా కంటోన్మెంట్ పరిధిలో 106 ఎకరాల భూమిని చెర విడిపించింది. బహదూర్‌గూడలో అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొందరు రైతులు అక్రమంగా సాగుచేసుకుంటున్నారు. ఒకవైపు విమానాశ్రయం, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు ఉండడంతో ఈ భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లు పడ్డాయి. రైతులను అడ్డం పెట్టుకొని రూ.కోట్ల విలువైన ఈ భూమిని కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు రైతులు తమ కబ్జాలో ఉన్న భూమిని అక్రమంగా విక్రయించారు. 1954 కాస్రా పహాణి ప్రకారం 25, 26 సర్వే నెంబర్లలో ఉన్న 650 ఎకరాల భూమి ప్రభుత్వానిది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 2002-2006 మధ్య ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి భూముల ఆక్రమణలు రెవెన్యూ రికార్డులతో సరిపోల్చే ప్రయత్నం చేశారు. క్రమబద్ధీకరించే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినా.. 2006లో సీసీఎల్‌ఏ అధికారులు తిరస్కరించారు. అప్పటికే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో భూముల కేటాయింపుపై నిషేధం ఉన్నట్టు సీసీఎల్‌ఏ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ భూముల్లో కొందరు వ్యవసాయం చేస్తుండగా.. మరికొందరు ఫామ్ హౌస్‌లు నిర్మించారు. వీరిని ఖాళీ చేయించి భూమి చుట్టూ కంచె నిర్మాణ పనులు చేపట్టినట్లు హైడ్రా అధికారులు శనివారం తెలిపారు.
అరెకరం కొని.. ఆక్రమణకు స్కెచ్
రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా యత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. పక్కనే ఉన్న అరెకరం ప్రైవేట్ పట్టా భూమి కొనుగోలు చేసిన కొందరు.. ఆ భూమి యజమానితో తక్కువ ధరకు ప్రభుత్వభూమినీ అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్వే నం.46లో 84 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులోకి ప్రవేశించి ఎకరం మేర కబ్జా చేశారు. దీనికి రిజిస్ర్టేషన్ కూడా జరగడం గమనార్హం. ఇక్కడ ఎకరం భూమి దాదాపు రూ.200 కోట్లు పలుకుతోంది. అప్రమత్తమైన రెవెన్యూ, హైడ్రా అధికారులు.. భూమిని స్వాధీనం చేసుకొని 84 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణలను తొలగించింది. ఈ మొత్తం భూమి మార్కెట్ విలువ రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.