ఐటీ కారిడార్‌లో హైడ్రా మెరుపుదాడి
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:21 AM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కబ్జాకు గురైన 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది.
రూ.1200 కోట్ల సర్కారు భూమి స్వాధీనం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కబ్జాకు గురైన 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. మార్కెట్‌ధర ప్రకారం ఈ భూమి విలువ రూ. 1200 కోట్లపై చిలుకేనని అంచనా. ఐటీ హబ్‌కి అత్యంత సమీపంలో ఖానామెట్‌లో సర్వే నంబరు 55లోని ఈ భూమిపై బడా రియల్‌ఎస్టేట్ సంస్థలతోపాటు రాజకీయ ప్రముఖుల కన్నుపడింది. ఇందులో 4.20 ఎకరాలు ఓ ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థ తన ఆధీనంలో ఉంచుకోగా, మరో 4 ఎకరాలు కొలను మాధవరెడ్డి కూతురు సబిత తనదని చెప్పుకున్నారు. ఈ భూమిలో అక్రమంగా ఆర్‌సీసీ ప్లాంటు, కార్మికులకు షెడ్లు నిర్మించి వినియోగిస్తున్నారు. ఈ భూకబ్జాపై ఫిర్యాదులందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారించారు. రెవెన్యూ రికార్డుల ప్రకా రం ప్రభుత్వభూమి అని, ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ దాన్ని నిషేదిత జాబితాలో పెట్టారని గుర్తించారు. దీంతో మంగళవారం ఉద యం భారీ బందోబస్తుతో హైడ్రా బృందం కూల్చివేత ప్రారంభించింది. మొత్తం 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, చుట్టూ ఫెన్సింగ్ వేసింది. గతంలో ఇదే సర్వేనంబరులో 11 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకోవడంతో పాటు సర్వేనంబరు 53లోని ఆక్రమణలను తొలగించింది.