1310 ఎకరాలు.. 70 వేల కోట్లు
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:15 AM
హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటై ఏడాదిన్నర అయింది.
ఇప్పటిదాకా హైడ్రా విడిపించిన ఆస్తులివి.. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల కబ్జాలపై కొరడా
ఏడాది క్రితం సంస్థ ఏర్పాటు.. ఫిర్యాదుల మేరకు కబ్జాలపై చర్యలు
స్వాధీన స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటై ఏడాదిన్నర అయింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కుల కబ్జాలపై అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటివరకు రూ.70వేల కోట్ల విలువైన 1310 ఎకరాలను హైడ్రా కాపాడింది. ప్రజావాణిలో, అలాగే హైడ్రా వాట్సప్ నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఆ సంస్థ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ స్థలమైతే రెవెన్యూ లేదా సంబంధించ శాఖ వద్ద ఉన్న వివరాలు, భూమి తమదేనని చెప్పే వారి డాక్యుమెంట్లు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. చెరువుల ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, నీటిపారుదల విభాగాల వద్ద ఉన్న రికార్డులు, లేక్ మెమోరియిల్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) శాటిలైట్ చిత్రాలు పరిశీలిస్తున్నారు. లే అవుట్లలోని పార్కులు, ప్రజావసర స్థలాల ఆక్రమణల విషయంలో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో ఇరు వర్గాల వద్ద ఉన్న డాక్యుమెంట్లను ఏకకాలంలో పరిశీలిస్తున్నారు. కబ్జాకు గురైన స్థలాలపై కోర్టు కేసులుంటే.. వాటి స్థితి, న్యాయస్థానం ఆదేశాలు ఏమిటన్నది పరిశీలించి హైడ్రా లీగల్ సెల్ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొందరు కోర్టు స్టే/ఆదేశాలకు భిన్నంగా ఆక్రమిత స్థలాల్లో శాశ్వత/తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన పక్షంలో తొలగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఆక్రమణలు తొలగించి హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములను ప్రభుత్వం వివిధ అవసరాల నిమిత్తం వినియోగిస్తోంది.
పలు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తోంది. గాజుల రామారంలోని సర్వే నంబర్ 307లో 300 ఎకరాలు కాపాడగా.. ఎన్‌సీసీ అకాడమీ, సమీకృత రిజిస్ట్రేషన్ ఆఫీస్, పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వ్, టీజీఎ్‌సఆర్‌టీసీ, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగాలకు స్థలం కేటాయించింది. ఇందులో కొంత భూమిపై కోర్టు కేసులు విచారణలో ఉన్నాయి.కబ్జా చెర విడిపించిన భూముల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేస్తోంది. ‘ఇది ప్రభుత్వ భూమి’ అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తోంది. గతంలోనూ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాలు ఫెన్సింగ్ వేసి, బోర్డులు ఏర్పాటు చేసినా ఆ భూములు కబ్జాలకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం హైడ్రా కాపాడిన స్థలాలను ప్రభుత్వ విభాగాల కోసం లేదా ప్రజావసరాల కోసం వినియోగించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. స్థల విస్తీర్ణాన్ని బట్టి స్థానికులకు ఉపయోగపడేలా పార్కులుగా అభివృద్ధి చేయాలని, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టాలని ఖైరతాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్ ఒకరు అభిప్రాయపడ్డారు.
తాజాగా కొండాపూర్‌లో..
కొండాపూర్‌లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన ఏడెకరాల భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు.. శనివారం ఆక్రమణలు తొలగించారు. కొండాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 78 నుంచి 93లో రాజరాజేశ్వరినగర్ కాలనీ పేరుతో 1993లో 2059 ప్లాట్లతో లేఅవుట్ అభివృద్ధి చేశారు. ఇందులో ప్రభుత్వ కళాశాలకు ఐదెకరాలు, పాఠశాల, పార్కు కోసం ఎకరం చొప్పున స్థలం కేటాయించారు. ఈ స్థలాల్లో చాలా చోట్ల నిర్మాణాలు వెలిశాయి. స్థానికుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు.. కమ్యూనిటీ హాల్‌కు కేటాయించిన స్థలంలో ఉన్న ప్రైవేట్ దుకానాలు, షెడ్లను తొలగించారు. ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి.. ప్రజావసర స్థలాలుగా పేర్కొంటు బోర్డులు ఏర్పాటు చేశారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న 7 ఎకరాల భూమి విలువ రూ.1400 కోట్ల వరకు ఉంటుందని సంస్థ పేర్కొంది.
చట్టపరంగానేచర్యలు
ఫిర్యాదులపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ఒకటికి రెండుసార్లు భూ యజమాన్యపు హక్కుపై పరిశీలన జరుపుతున్నాం. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ తదితర విభాగాలతోకలిసి ఆక్రమణకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నాం. కేసులున్న భూముల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. చట్టం ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఆ కబ్జా భూములను స్వాధీనం చేసుకోగలుగుతున్నాం. హైడ్రా ఏర్పాటైన జూలై 19, 2024 కంటే ముందు నిర్మించి ప్రజలు నివాసముంటున్న భవనాల జోలికి వెళ్లడంలేదు. పౌరులను ఇబ్బంది పెట్టడంకంటే.. అద్దె,వ్యాపారం నిమిత్తం వినియోగిస్తున్న ఆక్రమితస్థలాలపై దృష్టి సారించాం.
- ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఇప్పటిదాకా హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల వివరాలు
కుత్బుల్లాపూర్ మండలంగాజులరామారం సర్వే నంబర్ 307లో 300 ఎకరాలు
హఫిజ్‌పేటలో 39 ఎకరాలు
రాయదుర్గ్ కస్లా సర్వే నెంబర్ 5/2లోని నార్నే ఎస్టేట్స్‌లో 39 ఎకరాలు
కొండాపూర్ సర్వే నంబర్ 59లో 36 ఎకరాలు
కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్‌లోని సర్వే నంబర్ 25/2లో 37 ఎకరాలు
మణికొండలోని సర్వేనం.20లో 23ఎకరాలు
చెరువు స్థలాలు..
అమీన్‌పూర్ - 52 ఎకరాలు
నార్సింగ్‌లోని ముస్కిన్ చెరువు - 40 ఎకరాలు
తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు - 40 ఎకరాలు
కోకాపేటలోని కొత్త చెరువు- 15 ఎకరాలు
రాజేంద్రనగర్‌లో బుమ్‌రుఖ్ దౌల- 12 ఎకరాలు
అల్లాపూర్ సున్నం చెరువు - 12 ఎకరాలు
దూలపల్లి సుమర్‌కుంట - 12 ఎకరాలు
పార్కు స్థలాలు...
ఘట్‌కేసర్ మండలంలో 12 ఎకరాలు
ఘట్‌కేసర్ మండలం ప్రతాప్ సింగారం సర్వే నంబర్ 315లో 6.14 ఎకరాలు
అమీన్‌పూర్ పద్మావతినగర్ కాలనీ సర్వేనంబర్ 193, 194, 323లోని 4 ఎకరాలు
గాజుల రామారంలో 3.5 ఎకరాలు