HYDRA Rescues: 6 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:54 AM
మేడ్చల్ జిల్లా పోచారం డివిజన్ కాచవానిసింగారం రెవెన్యూ పరిధిలో నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని హైడ్రా విడిపించింది.
మేడ్చల్ జిల్లా కాచవాని సింగారంలో ప్రభుత్వ భూమి కబ్జా
ఆక్రమించి ప్లాట్లు వేసిన నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత
భూమిని స్వాధీనం చేసుకొని కంచె వేసిన హైడ్రా అధికారులు
హైదరాబాద్ సిటీ/ ఘట్‌కేసర్ రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా పోచారం డివిజన్ కాచవానిసింగారం రెవెన్యూ పరిధిలో నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని హైడ్రా విడిపించింది. సర్వే నం.66లో కబ్జాకు గురైన 6.12 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా అధికారులు సోమవారం కంచె ఏర్పాటుచేశారు. ఈ భూమిని నల్ల మల్లారెడ్డి ఆక్రమించి, 50 ప్లాట్లు వేసి విక్రయించారని గతంలో హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా, సర్వే విభాగం అధికారులు సర్వే చేసి అది ప్రభుత్వ భూమేనని నిర్ధారించారు. సోమవారం ఉదయం కంచె వేసి, అది ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అధికారులతో నల్ల మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. అది తన పట్టా భూమి అని, ఆ భూమిలోకి రావొద్దని కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. కాగా, ఏడాది క్రితం దివ్యనగర్ లే అవుట్‌లో రోడ్డుకు అడ్డుగా నల్ల మల్లారెడ్డి నిర్మించిన గోడలనూ అధికారులు కూల్చివేశారు.