Share News

ఒకే రోజు.. రూ.4 వేలకోట్ల రక్షణ

ABN , Publish Date - May 27 , 2026 | 05:07 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకేరోజు సుమారు రూ.4 వేల కోట్ల విలువైన 34 ఎకరాల భూములను హైడ్రా పరిరక్షించింది. చెరువు మధ్యలో మట్టిపోసి బండ్‌గా....

ఒకే రోజు.. రూ.4 వేలకోట్ల రక్షణ

  • 34 ఎకరాల భూములను కాపాడిన హైడ్రా

  • చెరువుల స్థలాన్ని కబ్జా చేసిన సంస్థలు

  • విల్లాల పక్కన ఆటస్థలాలుగా మార్పు

  • ఆక్రమణలన్నీ తొలగించిన హైడ్రా

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకేరోజు సుమారు రూ.4 వేల కోట్ల విలువైన 34 ఎకరాల భూములను హైడ్రా పరిరక్షించింది. చెరువు మధ్యలో మట్టిపోసి బండ్‌గా మార్చి చెరబట్టేందుకు ప్రయత్నించిన 22 ఎకరాల స్థలం వద్ద.. ఖరీదైన విల్లాల పక్కన చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆటస్థలంగా, ఓపెన్‌ ఏరియాగా చూపిన భూముల వద్ద ఆక్రమణలను మంగళవారం తొలగించింది.

కోకాపేటలో సుమారు 22 ఎకరాలు..

పలు నిర్మాణ సంస్థలు, రియల్టర్లు కలిసి అత్యంత ఖరీదైన ప్రాంతం కోకాపేటలో 72 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్తచెరువు మధ్యలో మట్టిపోసి కట్ట (బండ్‌) నిర్మించారు. ఎగువన ఉన్న 20 ఎకరాలకుపైగా భూమిలో ప్రహరీలు, రేకుల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. వాటిని హైడ్రా తొలగించింది. ఇక చెరువు పక్కనే ఖరీదైన విల్లాలు నిర్మించిన గోల్డ్‌ఫిష్‌ అనే సంస్థ చెరువు ఎఫ్‌టీఎల్‌లోని భూమిని మట్టితో పూడ్చి.. తమ ప్రాజెక్టులో ఓపెన్‌ స్పేస్‌గా చూపింది. అక్కడ బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌ కోర్టు లు, పిల్లల కోసం ఆటస్థలాన్ని నిర్మించింది. సుమారు 1.09 ఎకరాల ఈ స్థలంతోపాటు పక్కనే ఉన్న ఇతర ఆక్రమణలు తొలగించి హద్దుగా ఫెన్సింగ్‌ వేసింది.

ఈదులకుంట మొత్తానికి పరిరక్షణ!

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 6.05 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈదులకుంటను పూర్తిగా కబ్జా పెట్టారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల మధ్యలో చెరువు ఉండటాన్ని సాకు గా తీసుకున్న ఎన్‌వీఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ.. ఈదులకుంటలోని 6.05 ఎకరాలతోపాటు పక్కనే సర్వే నంబర్‌ 11/37లోని 5.16 ఎకరాల ప్రభుత్వ భూమినీ ఆక్రమించింది. ఈ భూములను కూకట్‌పల్లి మండలంలోని సర్వే నంబర్‌ 1003 నుంచి 1006 వరకు ఉన్నట్టు చూ పుతూ.. 14 అంతస్తుల భవన నిర్మాణానికి పనులు ప్రారంభించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గతంలోనే ఇరిగేషన్‌, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులతో కలిసి ఇక్కడ పరిశీలించారు. విచారణ అనంతరం ఇక్కడ చెరువు ఉన్న ట్టు గుర్తించారు. తాజాగా ఇక్కడ 11.21 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్‌ వేశారు. ఇక కూకట్‌పల్లి మండలంలోని ఖైత్లాపూర్‌ జెవెల్‌ హైట్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద రహదారి విస్తరణ కోసం జీహెచ్‌ఎంసీ గతంలో 1,700 చదరపు గజాల స్థలం సేకరించింది. స్థల యజమానికి పరిహారం కూడా చెల్లించింది. ఆ రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతో ఆ స్థలంలో యజమాని తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. వాటినీ హైడ్రా తొలగించింది.

Updated Date - May 27 , 2026 | 05:08 AM