రూ.1511 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:53 AM
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతన్న హైడ్రా మంగళవారం నగరంలోని నాలుగు చోట్ల ఆక్రమణలను తొలగించింది....
హైదరాబాద్‌లో ఒకేరోజు 4చోట్ల ఆక్రమణల తొలగింపు
కొండాపూర్‌లో 4 ఎకరాల జంగం కుంట కబ్జా
అల్వాల్‌లో కొత్త చెరువు పరిధిలో 8 ఎకరాల ఆక్రమణ
వన స్థలిపురం, మల్కాజిగిరిలో పార్కులు కూడా
ప్రహరీలు, షెడ్లు, లే అవుట్లు తొలగించి కంచె ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతన్న హైడ్రా మంగళవారం నగరంలోని నాలుగు చోట్ల ఆక్రమణలను తొలగించింది. వాటికి రక్షణగా కంచెను ఏర్పాటు చేసింది. రెండుచోట్ల 1100 గజాల మేర ఉన్న పార్కులను కాపాడింది. మరో రెండు ప్రాంతాల్లో 12 ఎకరాల మేర ఉన్న చెరువులను కాపాడింది. ఈ నాలుగు చోట్ల కలిపి భూమి విలువ రూ. 1511 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మునిసిపల్ కార్యాలయం-మదీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్‌లో నాలుగు ఎకరాల జంగం కుంటను పూడ్చేసి, చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు కొందరు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు సందర్శించి దానిని జంగం కుంటగా నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ భూమి విలువ రూ. 700 కోట్లు ఉన్నట్లు చెప్పారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల మేర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు కొద్ది రోజుల క్రితం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ పని వారికోసం తాత్కాలిక షెడ్లు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని, అక్కడ కొన్ని షెడ్లు కూడా వెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువు ఆక్రమణలను నిర్ధారించుకున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేయరాదనే నిబంధనను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహేబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడినగర్ కాలనీలో 650 చదరపు గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 132, 133లో 12 ఎకరాల మేర దాదాపు 161 ప్లాట్లతో జక్కిడి కుటుంబసభ్యలు లే ఔట్ వేశారు. అయితే పార్కు స్థలాన్ని తాజాగా లే అవుట్ వేసిన వారే 1985లో విక్రయించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు దానిని పార్కు స్థలంగానే నిర్ధారించారు. ఆక్రమణలు తొలగించి పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్‌లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును కూడా హైడ్రా అధికారులు కాపాడారు. జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్‌డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరీని, రేకుల షెడ్డును తొలగించారు.