HYDRA: 3 వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:21 AM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తామహబూబ్‌పేట సర్వే నంబరు 44 పరిధిలో ఉన్న ఆక్రమణలను శనివారం హైడ్రా తొలగించింది.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన..
మక్తామహబూబ్‌పేట సర్వే నంబరు 44లోని ఆక్రమణల తొలగింపు.. 15 ఎకరాల స్వాధీనం
నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌పై ఆ శాఖ అధికారులను విచారణకు పిలిచిన పోలీసులు..
హైదరాబాద్/మియాపూర్/హైదరాబాద్ సిటీ, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తామహబూబ్‌పేట సర్వే నంబరు 44 పరిధిలో ఉన్న ఆక్రమణలను శనివారం హైడ్రా తొలగించింది. ఈ సర్వే నంబరులో మొత్తం 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయాన్ని వెలుగులోకి తెస్తూ గతేడాది డిసెంబరు 25న ‘రూ.2 వేల కోట్ల భూమి కబ్జాకు స్కెచ్’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. నకిలీ డాక్యుమెంట్‌ను అడ్డు పెట్టుకుని భూమిని స్వాహా చేయాలనుకునే ముఠా కుట్రను బయటకు తేవడంతో విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హనుమంతు.. రంగారెడ్డి జాయింట్ సబ్‌రిజిస్ట్రార్-2 కె.మధుసూదన్ రెడ్డిని ఈ నెల 6న సస్పెండ్ చేశారు. ఇదే విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజాగా మక్తా మహబూబ్‌పేట సర్వే నంబరు 44లో ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రేకులతో ప్రహరీ వేసి ఆక్రమణలో ఉంచుకున్న 15 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసింది. ఆ భూమి విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. 159 సర్వే నంబరుకు సంబంధించిన పత్రాలతో సర్వే నంబరు 44లో ఎకరాకుపైగా ఆక్రమించిన ఇమ్రాన్ అనే వ్యక్తిపైనా ఇప్పటికే కేసు నమోదై ఉన్నట్లు పేర్కొంది. ఇక నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన విషయమై సస్పెండైన సబ్ రిజిస్ట్రార్ కె.మధుసూదన్‌రెడ్డిని, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతో్‌షరెడ్డిని శేరిలింగంపల్లి ఏసీపీ విచారణకు పిలిచారు. సర్వే నంబరు 44లో నకిలీ డాక్యుమెంట్ వెనకాల ఉన్న ముఠా వివరాలను సేకరించారు. ఆ రిజిస్ట్రేషన్‌లో ఎవరి పాత్ర ఏమిటన్న దానిపై ఆరా తీశారు.
రాంపల్లిలో వాటర్ బోర్డు 4 ఎకరాలు కూడా..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ సర్వే నంబరు 388లో వాటర్‌బోర్డుకు చెందిన 4.01 ఎకరాలను హైడ్రా కాపాడింది. వాటర్‌బోర్డు అవసరాల మేరకు ఇక్కడ భూమిని కేటాయించగా, దానిని స్వాధీనం చేసుకోవడంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుని ఆటంకాలు సృష్టించారు. దీంతో వాటర్ బోర్డు హైడ్రా సహాయాన్ని కోరింది. దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటర్ బోర్డుకు సర్కారు ఆ స్థలాన్ని కేటాయించినట్టు నిర్ధారించుకున్నారు. దీంతో ఆ 4.01 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి వాటర్ బోర్డుకు చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.