హైడ్రా ఆపరేషన్!
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:15 AM
పిల్లల చదువులు, భవిష్యత్తు అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఉద్దేశంతో 1,100 మంది 46 ఏళ్ల కింద కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి.
పటాన్‌చెరులో రూ.25 కోట్ల విలువైన 92 ఎకరాల లేఅవుట్ స్థలాల స్వాధీనం
కొన్నేళ్లుగా తమ ప్లాట్ల కోసం పోరాడుతున్న బాధితులు..
పటాన్‌చెరు/అమీన్‌పూర్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పిల్లల చదువులు, భవిష్యత్తు అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఉద్దేశంతో 1,100 మంది 46 ఏళ్ల కింద కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై బాధితులు పోరాడుతూ అందరూ అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. చివరకు హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు కమిషనర్ రంగనాథ్ స్పందించడంతో సమస్య పరిష్కారమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని పాటి గ్రామం ఆనంద్‌నగర్ కాలనీలో 92 ఎకరాల్లో వేసిన లేఅవుట్‌లో 1,100 మంది 1980లో ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ధరణి వచ్చాక ఆ లేఅవుట్‌ను వ్యవసాయ భూమిగా మార్పు చేయగా.. కొందరు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి విక్రయాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితుల ఫిర్యాదుతో గురువారం రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. లేఅవుట్ ప్రకారం ఉండాల్సిన పార్కు స్థలాలు, రోడ్లు కబ్జా అయినట్లు గుర్తించారు. పూర్తి సర్వే చేసి అక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణలో ఉన్న రోడ్లను పునరుద్ధరించారు. మొత్తంగా రూ.25 కోట్ల విలువైన 92 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. రైతులు అమ్ముకున్న భూమిని మరోసారి రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని హైడ్రా సీఐ బాలస్వామి చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
అమీన్‌పూర్, బీరంగూడ ప్రాంతాల్లోనూ..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అమీన్‌పూర్, బీరంగూడ, ఐలాపూర్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆక్రమణలను స్థానిక రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది గురువారం తొలగించారు. తనకు అందిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి బుధవారం అమీన్‌పూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై ఆరోపణలు రావడంతో కమిషనర్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బీరంగూడలోని శంభునికుంట చుట్టూ ఆక్రమించి డబ్బాలు, షెడ్లు వేసుకుని వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. 993, 630 తదితర సర్వే నంబర్లలో అసైన్డ్ భూముల్లో కొత్తగా పుట్టుకొచ్చిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. వివాదాస్పద ఐలాపూర్ భూముల్లో వెలిసిన బేస్‌మెంట్లను, గదులను తొలగించారు. ఆక్రమణ తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తామని అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేశ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ స్పష్టం చేశారు. పేదలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.