Share News

ఐలాపూర్‌ భూములకుఫెన్సింగ్‌

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:02 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో వివాదాస్పద భూముల స్వాధీనం ప్రక్రియను హైడ్రా రెండో రోజు ఆదివారం కూడా కొనసాగించింది.

ఐలాపూర్‌ భూములకుఫెన్సింగ్‌

  • గ్రామంలో కొనసాగుతున్న హైడ్రా ఆపరేషన్‌

  • గెస్ట్‌హౌస్‌, ఫాంహౌస్‌లోని నిర్మాణాల కూల్చివేత

  • బీరంగూడ వైపు రోడ్డు పక్కన దుకాణాల తొలగింపు

  • హైడ్రా చర్యలకు రాజగోపాల్‌నగర్‌ వాసుల మద్దతు

అమీన్‌పూర్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో వివాదాస్పద భూముల స్వాధీనం ప్రక్రియను హైడ్రా రెండో రోజు ఆదివారం కూడా కొనసాగించింది. న్యాయవాది, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎంఏ ముఖీంకు చెందిన గెస్ట్‌హౌస్‌ను నేలమట్టం చేశారు. రెండున్నర ఎకరాల ఫాంహౌస్‌ ప్రాంగణంలో మూడంతస్తుల భవనం, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, కార్యాలయాన్ని కూల్చివేశారు. స్థలం ప్రాంగణంలో ఉన్న పురాతన ఇంటితోపాటు షెడ్లను తొలగించారు. గెస్ట్‌హౌస్‌ ఎదుట ఏర్పాటు చేసిన గేటుతోపాటు 25 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి ఫెన్సింగ్‌ వేసే పనులు ప్రారంభించారు. గతంలో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి.. హైడ్రా వైర్‌ ఫెన్సింగ్‌ వేసే పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గెస్ట్‌హౌస్‌ చుట్టూ పెద్దఎత్తున పోలీసులు, హైడ్రా సిబ్బందిని మోహరించారు. హైడ్రా సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, రిజర్వ్‌ పొలీసు బలగాలు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందిని రప్పించారు. ముఖీం కుటుంబం అధీనంలో ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ షెడ్డును సైతం కూల్చివేశారు. ఐలాపూర్‌కే చెందిన మాణిక్‌యాదవ్‌ అనే వ్యక్తి కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. దాని చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. మరోవైపు ముఖీం సోదరుడు అజీం.. ఐలాపూర్‌ భూమిని కిష్టారెడ్డిపేట భూమిగా పేర్కొంటూ నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసే ప్రకియ రెండు రోజులుగా కొనసాగుతోంది. 1500 గజాలలో నిర్మించిన భారీ భవనం కావడంతో కూల్చివేసేందుకు అధిక సమయం పడుతోందని హైడ్రా సిబ్బంది తెలిపారు. ఇక కోర్టు పరిధిలోని వివాదాస్పద 861 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌ వేసి కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచే కొన్నిచోట్ల పనులు ప్రారంభించగా ఆదివారం వేగం పుంజుకున్నాయి.

అడ్డుకున్న గ్రామస్థులు..

గ్రామస్థులు, పేదల ఇళ్ల జోలికి వెళ్లబోమని హైడ్రా సిబ్బంది భరోసా ఇస్తున్నా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఐలాపూర్‌ గ్రామంలో పలువురి అధీనంలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్‌ వేసేందుకు ప్రయత్నించగా.. కొందరు యువకులు, మహిళలు అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తమ స్వాధీనంలో ఉన్న భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ రాత్రికి రాత్రే స్వాధీనం చేసుకోవడం న్యాయం కాదని వాగ్వాదానికి దిగారు. అయితే ఆందోళన చేస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలేశారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను తొలగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, గ్రామ పరిధిలోని రాజగోపాల్‌నగర్‌, విద్యుత్‌ సౌద ఉద్యోగుల లేఅవుట్‌ బాధితులు హైడ్రా చర్యలను సమర్థిస్తున్నారు. ఇకపై తాము ధైర్యంగా తమ హక్కుల కోసం పోరాడుతామని పేర్కొన్నారు. న్యాయస్థానంలో తమకు పూర్తి న్యాయం జరగుతుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ఐలాపూర్‌ భూములు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం, హైడ్రా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాయని ప్రశంసించారు.


బీరంగూడ రహదారి వైపు రోడ్డు పక్కన ఐలాపూర్‌ పరిధిలోని స్థలాలను ఆక్రమించి.. వివాదాస్పద, అసైన్డ్‌ భూముల్లో ఏర్పాటు చేసిన షెడ్లు, హోటళ్లు, గ్రానైట్‌ షాపులు, వెదురు కర్రల షాపులు, నర్సరీలు, పండ్ల దుకాణాలు, ఫర్నీచర్‌ షాపులను సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు. సామాన్లు తీసుకుంటామని కోరడంతో ఒక రోజు వ్యవధి ఇచ్చారు. ఐలాపూర్‌ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా కూల్చివేసిన గెస్ట్‌హౌస్‌ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఐలాపూర్‌ చౌరస్తా, కిష్టారెడ్డిపేట, ఐలాపూర్‌ తండా తదితర ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

హైడ్రాతో పేదల బతుకులు ఆగం: హరీశ్‌

పేదల బతుకులు కూల్చడానికే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారా అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల బతుకులను కాపాడాల్సిన ప్రభుత్వం, గూడు, నీడను ఇయ్యాల్సిందిపోయి, శని, ఆదివారాల్లో కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కాదు కదా, కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలను బంద్‌ పెట్టి ప్రజలను ఆగం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Apr 13 , 2026 | 06:02 AM