ఐలాపూర్‌లో 3వ రోజూ హైడ్రా ఆపరేషన్
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:29 AM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్ మూడో రోజు సోమవారం కూడా కొనసాగింది.
కొనసాగుతున్న కంచె నిర్మాణ పనులు, జియో ట్యాగింగ్
అజీం అపార్ట్‌మెంట్ కూల్చివేతలో సమస్యలు
పక్క భవనానికి ప్రమాదం జరగకుండా పనులు
అమీన్‌పూర్,ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్ మూడో రోజు సోమవారం కూడా కొనసాగింది. వివాదాస్పద భూముల్లో మళ్లీ కబ్జాలకు తావు లేకుండా హైడ్రా రక్షణ ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్‌ఎస్ నాయకుడు ఎంఏ ముఖీం కుటుంబం అధీనంలో ఉన్న గెస్ట్‌హౌస్‌ను నేలమట్టం చేసి సుమారు 30 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని స్వాధీనం చేసుకునే పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో ముఖీం కుటుంబం వేసిన కంచె, ప్రహరీలను తొలగించి కొత్తగా కంచె వేస్తున్నారు. వివాదాస్పద 823 ఎకరాల భూమి చుట్టూ కంచె నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బీరంగూడ రోడ్డు వైపు ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశానికి, రోడ్డుకు అవత లివైపు ఉన్న స్థలానికి రెండు వైపులా కంచె వేస్తున్నారు. ఐలాపూర్ గ్రామం చుట్టూ ఉన్న కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ, అమీన్‌పూర్ తదితర సరిహద్దు గ్రామాలను ఆనుకొని కంచె వేస్తున్నారు. కంచె వేయడంతో సరిపెట్టకుండా.. దానిని జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీని వల్ల ఎక్కడ కంచె ధ్వంసమైనా క్షణాల్లో హైడ్రాకు సమాచారం చేరుతుంది. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు నిత్యం స్థానిక పోలీసులు, హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది గస్తీని కొనసాగిస్తారని అధికారులు తెలిపారు. ఎవరైనా భూముల కబ్జాకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేయాలని హైడ్రా ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కొనసాగిన అపార్ట్‌మెంట్ కూల్చివేత
ఐలాపూర్ గ్రామ సరిహద్దుల్లో ముఖీం సోదరుడు అజీంకు చెందిన భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసే పనులు సోమవారం కొనసాగాయి. భారీ భవనం కూల్చే క్రమంలో పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై శకలాలు పడటంతో అందులోని వారు భయభ్రాంతులకు గురయ్యారు. పక్క భవనానికి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటూ కూల్చివేయడానికి ఎక్కువ సమయం పడుతోందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో భవనం నేలమట్టం అయ్యే అవకాశాలున్నాయి. బీరంగూడ రోడ్డు వైపు ఐలాపూర్ భూముల్లో వెలసిన దుకాణాల యజమానులకు హైడ్రా నోటీసులు అందడంతో వారు ఖాళీ చేస్తున్నారు. సామాన్లు, షెడ్లకు వేసిన రేకులను తీసుకెళ్లారు.