Share News

రూ.30 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:05 AM

ప్రభుత్వ భూమి పరిరక్షణకు హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. పుప్పాల్‌గూడలో 200 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌ వేసింది. దీని విలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని సంస్థ పేర్కొంది.

రూ.30 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమి పరిరక్షణకు హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. పుప్పాల్‌గూడలో 200 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌ వేసింది. దీని విలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు చారిత్రక నేపథ్యంతో పాటు గుట్టలు, ఆలయాలున్న ఈ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావాణిలో సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి, శుక్రవారం దీని చుట్టూ ఫెన్సింగ్‌ పనులు మొదలుపెట్టారు. పుప్పాల్‌గూడలోని సర్వే నం.452/1లో 174 ఎకరాలు, సర్వే నం.454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాల్లో హెచ్‌ఎండీఏకు 263.05 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. పుప్పాల్‌గూడ, ఖాజాగూడల మధ్య ఓవర్‌ ల్యాప్‌ వివాదాలతో 63.05 ఎకరాల భూమి ప్రైవేట్‌ వ్యక్తులదిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్‌ఎండీఏకు 200 ఎకరాలు మిగిలింది. మిగతా 30ఎకరాల్లో చారిత్రక గుట్టల మధ్య ఆలయాలకు ఐదెకరాలు, దర్గాకు ఐదెకరాలు కేటాయుంచారు. 2019లో ఈ భూమిని కాపాడాలని సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయుంచారు. దీంతో ఫెన్సింగ్‌ వేయాలని పురపాలక, రెవెన్యూ శాఖలను కోర్టు ఆదేశించింది. అయినా ఆ విభాగాలు పట్టించుకోలేదు. ఇటీవల హైడ్రా ప్రజావాణిలో సొసైటీ ప్రతినిధులు హైకోర్టు ఆదేశాలను అధికారులకు అందజేశారు. పలు విభాగాల అధికారులు దానిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించడంతో.. హైడ్రా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది.

Updated Date - Jun 06 , 2026 | 04:05 AM